KKR vs PBKS: రసెల్‌ అదరహో..

కోల్‌కతా ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ పైచేయి సాధించింది. రసెల్‌ ఆ జట్టు హీరో. క్లిష్టపరిస్థితుల్లో అతడు విరుచుకుపడ్డ వేళ పంజాబ్‌ను నైట్‌రైడర్స్‌ ఓడించింది.

Updated : 09 May 2023 07:12 IST

కోల్‌కతా ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం
పంజాబ్‌పై విజయం
మెరిసిన రాణా, రింకూ
రాణించిన వరుణ్‌

కోల్‌కతా ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ పైచేయి సాధించింది. రసెల్‌ ఆ జట్టు హీరో. క్లిష్టపరిస్థితుల్లో అతడు విరుచుకుపడ్డ వేళ పంజాబ్‌ను నైట్‌రైడర్స్‌ ఓడించింది. చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు అవసరమైన స్థితిలో సిక్సర్ల మోతతో పంజాబ్‌కు రసెల్‌ షాకిచ్చాడు. ఉత్కంఠ పోరులో విన్నింగ్‌ షాట్‌ మాత్రం రింకూదే. ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టిన అతడు.. రసెల్‌ శ్రమ వృథా కాకుండా చూశాడు. పదకొండు మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌కు ఇది అయిదో విజయం. అన్నే మ్యాచ్‌ల్లో పంజాబ్‌ ఆరో పరాజయాన్ని చవిచూసింది.

కోల్‌కతా

కోల్‌కతా మురిసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌ (57; 47 బంతుల్లో 9×4, 1×6) రాణించడంతో మొదట పంజాబ్‌ 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. వరుణ్‌ చక్రవర్తి (3/26) ఆ జట్టును కట్టడి చేశాడు. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (51; 38 బంతుల్లో 6×4, 1×6), జేసన్‌ రాయ్‌ (38; 24 బంతుల్లో 8×4), రసెల్‌ (42; 23 బంతుల్లో 3×4, 3×6), రింకూ సింగ్‌ (21 నాటౌట్‌; 10 బంతుల్లో 2×4, 1×6) మెరవడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మెరిసిన నితీశ్‌, రసెల్‌

కోల్‌కతా ఛేదనలో కెప్టెన్‌ నితీశ్‌ రాణా, రసెల్‌ ఇన్నింగ్సే హైలైట్‌. రాణా కీలక ఇన్నింగ్స్‌తో జట్టును పోటీలో నిలిపితే.. ఆఖర్లో పరిస్థితులు క్లిష్టంగా మారిన సమయంలో రసెల్‌ అదరగొట్టాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో కోల్‌కతాకు మంచి ఆరంభమే దక్కింది. 7 ఓవర్లలో 63/1. వెంకటేశ్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 11), నితీశ్‌  రాణా నిలిచినా.. స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. కానీ లివింగ్‌స్టన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో రాణా జోరందుకున్నాడు. అయ్యర్‌ది మాత్రం అదే పరిస్థితి. దీంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. ఒత్తిడిలో ముందుకొచ్చి ఆడబోయిన అయ్యర్‌.. చాహర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివరి అయిదు ఓవర్లలో 58 పరుగులు అవసరం కాగా.. నితీశ్‌ రాణా కూడా ఔట్‌ కావడంతో లక్ష్యం కోల్‌కతాకు క్లిష్టంగా మారింది. అయితే రసెల్‌, రింకూ బ్యాట్‌ ఝుళిపించడంతో చివరి రెండు ఓవర్లలో కోల్‌కతాకు 26 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒక్కసారిగా విరుచుకుపడ్డ రసెల్‌.. సామ్‌ కరన్‌ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేసి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పేశాడు. చివరి ఓవర్లో 6 పరుగులే అవసరమైనా.. అర్ష్‌దీప్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. అతడు తొలి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. అయిదో బంతికి రసెల్‌ రనౌటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరంగా కాగా.. అర్ష్‌దీప్‌ ఫుల్‌టాస్‌ను రింకూ అలవోకగా బౌండరీ దాటించడంతో కోల్‌కతా సంబరాల్లో మునిగిపోయింది.

పంజాబ్‌కు వరుణ్‌ కళ్లెం

చక్రవర్తి సూపర్‌ బౌలింగ్‌తో అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ను కోల్‌కతా కట్టడి చేసింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ దూకుడుగానే ఆరంభమైనా అది చాలా కొద్దిసేపే. ఆ జట్టు 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అర్ధసెంచరీ సాధించినా ఆటలో వాడి లోపించింది. అయితే ఆఖర్లో బ్యాటర్ల మెరుపులు పంజాబ్‌కు కాస్త మెరుగైన స్కోరును అందించాయి. టాస్‌ గెలిచి పంజాబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదేశాడు. కానీ తర్వాతి ఓవర్లో అతడు, నాలుగో ఓవర్లో రాజపక్స ఔటయ్యారు. దూకుడుగా ఆడిన మరో ఓపెనర్‌ ధావన్‌ చక్కని బౌండరీలు సాధించాడు. మరోవైపు రసెల్‌ బౌలింగ్‌లో లివింగ్‌స్టన్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. కానీ అతడు ఎక్కువసేపు నిలవలేకపోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్‌ 58/3తో నిలిచింది. ఆ తర్వాత ధావన్‌.. జితేశ్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ దూకుడుగా ఆడలేకపోయాడు. జితేశ్‌ శర్మ (21; 18 బంతుల్లో 2×6) కూడా అంతే. దీంతో స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. కాస్త మందకొడిగా ఉన్న పిచ్‌పై వరుణ్‌ చక్రవర్తితో పాటు ఇతర స్పిన్నర్లు నరైన్‌, సుయాశ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. 12వ ఓవర్లో నరైన్‌ బౌలింగ్‌లో ధావన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పంజాబ్‌ స్కోరు 100 దాటింది. కానీ తర్వాతి ఓవర్లోనే జితేశ్‌ను వరుణ్‌ చక్రవర్తి ఔట్‌ చేయడంతో 53 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్‌కు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లలో శిఖర్‌ ధావన్‌, రిషి ధావన్‌ (19; 11 బంతుల్లో 1×4, 1×6), సామ్‌ కరన్‌ (4) వికెట్లు కూడా కోల్పోయిన పంజాబ్‌.. 18 ఓవర్లు ముగిసే సరికి 143/7తో నిలిచింది. కానీ చివరి రెండు ఓవర్లలో బ్యాటర్లు అనూహ్యంగా చెలరేగడంతో ఆ జట్టు సంతృప్తిగా ఇన్నింగ్స్‌ను ముగించింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17 నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 1×6) రెండు ఫోర్లు, షారుక్‌ ఖాన్‌ (21 నాటౌట్‌; 8 బంతుల్లో 3×4, 1×6) ఫోర్‌ కొట్టడంతో 19వ ఓవర్లో అరోరా 15 పరుగులివ్వగా.. ఆఖరి ఓవర్లో హర్షిత్‌ రాణా ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో షారుక్‌ వరుసగా 6, 4, 4 బాదగా.. హర్‌ప్రీత్‌ ఓ ఫోర్‌ కొట్టాడు. వరుణ్‌ చక్రవర్తి (3/26) గొప్పగా బౌలింగ్‌ చేశాడు.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) గుర్బాజ్‌ (బి) హర్షిత్‌ రాణా 12; శిఖర్‌ ధావన్‌ (సి) వైభవ్‌ (బి) నితీశ్‌ 57; రాజపక్స (సి) గుర్బాజ్‌ (బి) హర్షిత్‌ రాణా 0; లివింగ్‌స్టన్‌ ఎల్బీ (బి) వరుణ్‌ చక్రవర్తి 15; జితేశ్‌ శర్మ (సి) గుర్బాజ్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 21; సామ్‌ కరన్‌ (సి) గుర్బాజ్‌ (బి) సుయాశ్‌ 4; రిషి ధావన్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 19; షారుక్‌ ఖాన్‌ నాటౌట్‌ 21; హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-21, 2-29, 3-53, 4-106, 5-119, 6-139, 7-139; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 3-0-32-0; హర్షిత్‌ రాణా 3-0-33-2; రసెల్‌ 1-0-19-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-26-3; సుయాశ్‌ శర్మ 4-0-26-1; నరైన్‌ 4-0-29-0; నితీశ్‌ రాణా 1-0-7-1

కోల్‌కతా ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) షారుక్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 38; గుర్బాజ్‌ ఎల్బీ (బి) ఎలిస్‌ 15; నితీశ్‌ రాణా (సి) లివింగ్‌స్టన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 51; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) లివింగ్‌స్టన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11; రసెల్‌ రనౌట్‌ 42; రింకూ సింగ్‌ నాటౌట్‌ 21; శార్దూల్‌ ఠాకూర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-38, 2-64, 3-115, 4-124, 5-178; బౌలింగ్‌: రిషి ధావన్‌ 2-0-15-0; అర్ష్‌దీప్‌ 4-0-39-0; నాథన్‌ ఎలిస్‌ 4-0-29-1; కరన్‌ 3-0-44-0; లివింగ్‌స్టన్‌ 2-0-27-0; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1-0-4-1; రాహుల్‌ చాహర్‌ 4-0-23-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని