Pakistan: ఆసియాకప్‌నకు పాక్‌ దూరం?

ఆసియాకప్‌ను తమ దేశం నుంచి శ్రీలంకకు తరలించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్‌ ఈ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated : 10 May 2023 11:12 IST

కరాచి: ఆసియాకప్‌ను తమ దేశం నుంచి శ్రీలంకకు తరలించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్‌ ఈ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడాలని పాక్‌ చేసిన ‘హైబ్రిడ్‌ మోడల్‌’ ప్రతిపాదనను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సభ్య దేశాలు తిరస్కరించాయి. దీంతో ఈ కప్‌ను ఏసీసీ.. పాక్‌ నుంచి తరలించింది. ఈ విషయంపై మంగళవారం దుబాయ్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధికారులతో సమావేశమైన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజామ్‌ సేథి.. కప్‌ను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.

‘‘ఆసియాకప్‌ నిర్వహణపై తమ ప్రతిపాదనలను ఏసీసీ ముందు ఉంచాం. ఒకవేళ సభ్యదేశాలు అంగీకరించకపోతే 2018, 2022లో మాదిరే యూఏఈలో టోర్నీ నిర్వహించాలి. సెప్టెంబర్‌లో యూఏఈలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్థమే లేదు. 2020లో ఐపీఎల్‌ టోర్నీ సెప్టెంబర్‌-నవంబర్‌లో ఇదే వేదికలో జరిగిన విషయం గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరిలో జరిగిన ఏసీసీ సమావేశంలో శ్రీలంక ఆసియాకప్‌ ఆతిథ్య ప్రతిపాదనను బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ తిరస్కరించాయి. కానీ ఉన్నట్టుండి లంకకు ఆతిథ్య హక్కులు దక్కడానికి ఆ దేశాలు ఎలా అంగీకరిస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని పీసీబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆసియాకప్‌ను శ్రీలంక తరలించడంలో భారత్‌ వెనుక నుంచి సహకారం అందించిందని పీసీబీ భావిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 2న ఆసియాకప్‌ ఆరంభం కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని