icon icon icon
icon icon icon

అవినీతి వైకాపా.. అంతానికే మా పొత్తు

రైతులకు మేలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం మంజూరుచేసిన పోలవరం ప్రాజెక్టు.. జగన్‌ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు.

Updated : 06 May 2024 07:13 IST

జగన్‌ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది
మద్యనిషేధం అని చెప్పి.. మద్యం సిండికేట్‌ నడుపుతున్నారు
అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పేట్రేగిపోతున్నారు
అమరావతిని పునర్నిర్మిస్తాం
తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుతాం
ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్‌షా
మన భూమి అమ్మాలంటే జగన్‌ అనుమతి తీసుకోవాలంట
గూబ గుయ్‌ అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: రైతులకు మేలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం మంజూరుచేసిన పోలవరం ప్రాజెక్టు.. జగన్‌ అవినీతి వల్లే ముందుకు సాగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక తానే మద్యం సిండికేట్‌ నడిపిస్తూ నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని దుయ్యబట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్న అమిత్‌షా.. జగన్‌ పాలనలో అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూమాఫియా, అరాచకాలు, అవినీతిలో వైకాపా ప్రభుత్వం కూరుకుపోయిందని.. ఐదేళ్లలో రూ.13.50 లక్షల కోట్ల అప్పుల్ని ప్రజల నెత్తిపై పెట్టిందని విరుచుకుపడ్డారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. ఇప్పుడు 25కి 25 లోక్‌సభ సీట్లు.. మూడింట రెండొంతుల అసెంబ్లీ సీట్లు ఎన్డీయే కూటమికి ఇవ్వండి. చంద్రబాబు ముఖ్యమంత్రి, మోదీ ప్రధాని అవుతారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు’’ అని హామీ ఇచ్చారు.

అమరావతిని పునర్నిర్మిస్తాం

‘‘వైకాపా గూండాలను అణచివేయడానికి.. రాష్ట్రంలో వైకాపా అవినీతిని పూర్తిగా అంతం చేసేందుకే భాజపా, తెదేపా, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఏడుకొండల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుతాం. తెలుగుభాష పరిరక్షణకు కృషి చేస్తాం. జగన్‌ తెలుగు భాషను అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చి తెలుగును సమాధి చేసే కుట్ర చేస్తున్నారు. భాజపా అది జరగనివ్వదు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సీఎం జగన్‌కు ఆహ్వానం పంపినా రాలేదు. అలాంటి వ్యక్తికి మీరంతా ఓట్లు వేస్తారా? దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడ్డాక... అమరావతిని పునర్నిర్మిస్తాం. పోలవరంతో పాటు హంద్రీ-నీవానూ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటివరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 100 సీట్లకు పైగా ఎన్డీయే గెలుచుకుంటుంది. అన్ని విడతల్లో కలిపి 400 సీట్లు సాధించే దిశగా దూసుకుపోతున్నాం’’ అని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మోదీ చేతుల్లోనే దేశం సురక్షితం

‘‘నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇండియా కూటమిలో ఏ పార్టీకీ నిలకడ లేదు. ఆ కూటమి గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో స్పష్టత లేదు. నరేంద్రమోదీ మాత్రమే దేశాన్ని సురక్షితంగా ఉంచుతారు. మళ్లీ ప్రధాని అయితే 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తారు. 10కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ పథకం ద్వారా రూ.3లక్షల కోట్లు ఖాతాల్లో జమచేస్తారు. 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్‌ కల్పించడమే మోదీ లక్ష్యం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.


భూములన్నింటినీ దోచుకునే కుట్ర

-చంద్రబాబు

ట్టాదారు పాస్‌పుస్తకాలపై సీఎం జగన్‌ ఫొటో ఎందుకని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. ‘‘తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకోవాలంటే జగన్‌ అనుమతి తీసుకోవాలంట.. అదేమైనా వాళ్ల నాన్న, తాత, నాన్నమ్మ ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘‘కొత్తగా ఓ చట్టం తీసుకొచ్చారు. మొత్తం భూములన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయట. అమ్ముకోవాలంటే అనుమతి కావాలి. పట్టాదారు పాస్‌పుస్తకం కాకుండా జిరాక్స్‌ ఇస్తారట. అది ముక్కు తుడుచుకోవడానికైనా పనికొస్తుందా? రాష్ట్రంలోని భూములన్నింటినీ దోచేందుకు కుట్రచేస్తున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఇప్పుడు మీ ఆస్తులకే ఎసరుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వ్యక్తికి ఎన్నికల్లో గూబ గుయ్‌మనాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు.

శవ రాజకీయాలు చేసే జగన్‌ను ఇంటికి పంపిద్దాం

‘రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2వేలు చేసింది తెదేపానే. మొట్టమొదట పింఛన్లు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. ఇప్పుడు పింఛను సాయాన్ని రూ.4వేలకు పెంచుతామని హామీ ఇస్తున్నా. ఏప్రిల్‌ నుంచి బకాయిల్ని కలిపి జులైలో ప్రతి ఒక్కరికీ రూ.7వేలు అందిస్తాం. వికలాంగులకూ బకాయితో కలిపి రూ.12వేలు ఇస్తాం. చేతులు, కాళ్లు లేనివారికి ప్రతినెలా రూ.15వేలు ఇస్తాం. పింఛనుదారులపై కుట్రకు తెరతీసిన జగన్‌.. మళ్లీ శవ రాజకీయం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛను ఇవ్వకుండా వృద్ధులను సచివాలయానికి రప్పించారు. చనిపోయిన వారికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా. మళ్లీ బ్యాంకుల్లో ఖాతాల్లో నగదు వేశారు. సచివాలయ ఉద్యోగులను వదిలేసి బ్యాంకుల చుట్టూ తిప్పే పరిస్థితి వచ్చింది. శవ రాజకీయాలు చేసే ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘జగన్‌ మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశారు. మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే కేంద్రం సహకారంతో అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టే బాధ్యత నాది. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే పదేళ్ల తర్వాత కూడా మన రాజధాని ఏదో చెప్పుకోలేం. పోలవరానికి కట్టుబడి ఉన్నామని నరేంద్రమోదీ చెప్పారు. జగన్‌ అవినీతికి పాల్పడుతూ పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని అమిత్‌షా అన్నారు. పోలవరంతో పాటు హంద్రీ-నీవా పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదని హామీ ఇస్తున్నా.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్‌ కల నెరవేరుతోంది

‘‘మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కావాలని ఎప్పటినుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు ఆ కల నెరవేరుతోంది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేదు. రైతుల కోసం కేంద్రం రూ.6వేలు ఆర్థికసాయం చేస్తోంది. మొత్తం 12,500 ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. రాష్ట్రం వాటా రూ.7,500 మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నారు. ప్రతి రైతుకూ రూ.20వేలు ఇచ్చే బాధ్యత తెదేపా తీసుకుంటోంది. 90% సబ్సిడీతో మళ్లీ బిందుసేద్యం తీసుకొస్తాం’’ అని చంద్రబాబు హమీ ఇచ్చారు.


నా స్నేహితుడు సత్యకుమార్‌ను గెలిపించండి

ర్మవరం నియోజకవర్గ బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థి సత్యకుమార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అమిత్‌షా కోరారు. ఇది తన వ్యక్తిగత విజ్ఞప్తి అని చెప్పారు. సత్యకుమార్‌ తనకు చిరకాల స్నేహితుడని తెలిపారు. సత్యకుమార్‌ను గెలిపిస్తే కేంద్రం సహకారంతో ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తారని, ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను కోరారు.


అనుకున్నదాని కంటే ఎక్కువ సీట్లు

విజయంపై ధీమా వ్యక్తం చేసిన అమిత్‌షా

సభ అనంతరం చంద్రబాబుతో ప్రత్యేక భేటీ

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఏపీలో తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి వస్తున్నట్లు తమవద్ద పూర్తి సమాచారం ఉందంటూ తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పినట్లు సమాచారం. ధర్మవరంలో సభ అనంతరం హెలిప్యాడ్‌ వద్ద వారిద్దరూ ప్రత్యేకంగా ముచ్చటించారు. తమకున్న నివేదికల ప్రకారం ఏపీలో కూటమికి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని అమిత్‌షా తెలిపినట్లు, ప్రజలు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నట్లు నివేదిక అందిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం కోసం ఎండను కూడా లెక్కచేయకుండా రోజుకు మూడుసభల్లో పాల్గొనడంపై చంద్రబాబును అమిత్‌షా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img