షూటౌట్లో బ్రిటన్‌పై భారత్‌ విజయం

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌ రెండో అంచె పోటీల్లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. శనివారం బ్రిటన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో పెనాల్టీ షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది.

Updated : 04 Jun 2023 02:39 IST

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌

లండన్‌: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌ రెండో అంచె పోటీల్లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. శనివారం బ్రిటన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో పెనాల్టీ షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. అంతకంటే ముందు మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 4-4తో నిలిచాయి. భారత్‌ తరపున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (7వ నిమిషంలో), మన్‌దీప్‌ సింగ్‌ (19వ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (28వ), అభిషేక్‌ (50వ) తలో గోల్‌ కొట్టారు. ప్రత్యర్థి జట్టులో సామ్‌ వార్డ్‌ (8వ, 40వ, 47వ, 53వ) ఒక్కడే నాలుగు గోల్స్‌తో సత్తాచాటాడు. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ భారత ఖాతా తెరిచాడు. కానీ వెంటనే సామ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా చేసి స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి దూకుడుగా ఆడిన టీమ్‌ఇండియా ఓ దశలో 3-1తో ఆధిక్యం సాధించింది. కానీ సామ్‌ను ఆపడంలో విఫలమై 3-3తో నిలిచింది. ఆ తర్వాత 4-3తో గెలిచేలా కనిపించింది. కానీ మరోసారి సామ్‌ గోల్‌తో స్కోరు సమమై.. పోరు షూటౌట్‌కు దారితీసింది. ఇందులో మన్‌ప్రీత్‌, హర్మన్‌ప్రీత్‌, లలిత్‌, అభిషేక్‌ బంతిని గోల్‌పోస్టులోకి పంపారు. ప్రత్యర్థి తరపున విల్‌, వల్లాస్‌ మినహా స్కోరు చేయలేకపోవడంతో భారత్‌ గెలిచింది. 12 మ్యాచ్‌ల్లో 24 పాయింట్లతో బ్రిటన్‌ (11 మ్యాచ్‌ల్లో 26) తర్వాత  భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఐరోపా అంచె పోటీల కోసం నెదర్లాండ్స్‌ వెళ్లనున్న భారత్‌.. బుధవారం ఆతిథ్య జట్టుతో తలపడుతుంది.


భారత్‌ 22.. ఉజ్బెకిస్థాన్‌ 0

కకామిగారా (జపాన్‌): మహిళల ఆసియాకప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌కు అదిరే ఆరంభం! పూల్‌-ఏ తొలి మ్యాచ్‌లో గోల్స్‌ వర్షం కురిపించిన భారత్‌ 22-0తో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. అన్ను (13, 29, 30, 38, 43, 51 నిమిషాలు) డబుల్‌ హ్యాట్రిక్‌తో జట్టు భారీ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముంతాజ్‌ఖాన్‌ (6, 44, 47, 60), దీపిక (32, 44, 46, 57) చెరో నాలుగు గోల్స్‌ కొట్టగా.. వైష్ణవి విఠల్‌ (3, 56), దీపిక సొరెంగ్‌ (18, 25), సనెలిటా టొప్పో (17, 17) రెండు చొప్పున.. మంజు చౌరాసియా (26), నీలమ్‌ (47) ఒక్కో గోల్‌ సాధించారు. అర్ధభాగం ముగిసే సరికి 10-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన ప్రీతి బృందం.. బ్రేక్‌ తర్వాత మరో 12 గోల్స్‌ సాధించింది. సోమవారం మలేసియాతో భారత్‌ తలపడనుంది.


సైన్యంకు స్వర్ణం

జూనియర్‌ ప్రపంచకప్‌

సుల్‌ (జర్మనీ): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్‌ సైన్యం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ స్వర్ణం గెలుచుకుంది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో సైన్యం 238 పాయింట్లు స్కోర్‌ చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో పోటీపడ్డ మరో భారత షూటర్‌ సురిచి ఇందర్‌ సింగ్‌ (154.1) ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. కొరియాకు చెందిన కిమ్‌ మిన్సియో (236) రజతం నెగ్గగా.. చైనీస్‌ తైపీ అమ్మాయి లియు హెంగ్‌ యు (216.9) కాంస్యం చేజిక్కించుకుంది. సైన్యం ఫిబ్రవరిలో ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో 10మీ ఎయిర్‌ పిస్టల్‌ కాంస్యం సాధించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు