Harmanpreet Kaur: హర్మన్‌.. ఇది సరైందేనా?

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. భారత మహిళల జట్టు కెప్టెన్‌.. సీనియర్‌ బ్యాటర్‌.. అంతర్జాతీయ ఉత్తమ క్రికెటర్లలో ఒకరు. అలాంటి స్థాయిలో ఉన్న ఆమె ప్రవర్తన.. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో, మ్యాచ్‌ తర్వాత సరిగ్గా లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Updated : 24 Jul 2023 08:16 IST

బంగ్లాతో మ్యాచ్‌లో ప్రవర్తనపై విమర్శలు
భారత కెప్టెన్‌పై ఐసీసీ చర్యలు
మీర్పూర్‌

ర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. భారత మహిళల జట్టు కెప్టెన్‌.. సీనియర్‌ బ్యాటర్‌.. అంతర్జాతీయ ఉత్తమ క్రికెటర్లలో ఒకరు. అలాంటి స్థాయిలో ఉన్న ఆమె ప్రవర్తన.. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో, మ్యాచ్‌ తర్వాత సరిగ్గా లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంపైర్ల నిర్ణయాలపై క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం మామూలే. కానీ టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ హద్దు మీరి ప్రవర్తించిందని, ఆమె వ్యవహార శైలి ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పూర్తిగా నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మ్యాచ్‌లో హర్మన్‌ను అంపైర్‌ ఔట్‌ అయితే ఇచ్చాడు.. కానీ అది ఎల్బీనా లేదా క్యాచ్‌ ఔటా అన్నదానిపై మొదట సందేహం నెలకొంది. క్యాచౌట్‌ అని తర్వాత తేలింది. హర్మన్‌ ఔటే. కానీ బౌలర్‌ అప్పీల్‌ చేయడమే ఆలస్యం ఔట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంపైర్లు వ్యవహరించడం హర్మన్‌కు కోపాన్ని తెప్పించింది. దీంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టిన ఆమె.. అంపైర్ల వైపు సంజ్ఞలు చేస్తూ, ఏవో మాటలంటూ బయటకు వెళ్లింది. అంతకుముందు యాస్తిక ఎల్బీ, ఆఖరి ఓవర్లో మేఘన క్యాచ్‌ విషయంలోనూ ఇలాగే జరిగిందని భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మ్యాచ్‌ ముగిశాక అంపైర్ల తీరుపై హర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంపైరింగ్‌ పేలవంగా ఉందని, మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చేముందే ఇలాంటి అంపైరింగ్‌కు సన్నద్ధమయ్యే వస్తామని ఆమె పేర్కొంది. అంతే కాకుండా 1-1తో సిరీస్‌ను పంచుకోవడంతో ట్రోఫీ ప్రదానోత్సవం తర్వాత రెండు జట్ల ఉమ్మడి ఫొటో సమయంలోనూ హర్మన్‌.. బంగ్లా క్రికెటర్లను అవమానపరిచేలా మాట్లాడినట్లు వెల్లడైంది. ‘‘అంపైర్లనూ పిలవండి. కేవలం మీరు మాత్రమే ఎందుకున్నారు? మీరు మ్యాచ్‌ను టై చేసుకోలేదు. మీ కోసం అంపైర్లు ఆ పని చేశారు. వాళ్లతో ఫొటో దిగితే బాగుంటుంది’’ అని హేళనగా మాట్లాడటంతో.. బంగ్లా కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా తమ క్రికెటర్లను తీసుకుని ఫొటో దిగకుండానే వెళ్లిపోయింది. ‘‘అది హర్మన్‌ సమస్య. కానీ బంగ్లాదేశ్‌ క్రికెటర్ల పట్ల ఆమె సంస్కారంతో వ్యవహరించాల్సింది. అందుకే ఫొటో కోసం అక్కడ ఉండడం నచ్చక మా క్రికెటర్లతో కలిసి వెళ్లిపోయా. క్రికెట్‌ అనేది గౌరవం, క్రమశిక్షణకు సంబంధించిన ఆట. ఈ అంపైర్లకు అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉంది. మనకు నచ్చినా, నచ్చకపోయినా వీళ్లవే తుది నిర్ణయాలు’’ అని నిగార్‌ తెలిపింది. మరోవైపు హర్మన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్‌ ఫీజులో 75 శాతం జరిమానాతో పాటు 3 అయోగ్యతా పాయింట్లు కూడా కేటాయించింది.

తటస్థ అంపైర్లుండాలి..: బంగ్లా క్రికెటర్లను అవమానించేలా హర్మన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన తెలిపింది. మ్యాచ్‌లో తటస్థ అంపైర్లుండాలని ఆమె అభిప్రాయపడింది. మైదానంలోని అంపైర్లతో పాటు మూడో అంపైర్‌, మ్యాచ్‌ రిఫరీ కూడా బంగ్లాదేశ్‌కు చెందినవాళ్లే కావడం గమనార్హం. ‘‘బంగ్లా క్రికెటర్లను అవమానిస్తూ హర్మన్‌ ఏం మాట్లాడలేదు. కేవలం అంపైరింగ్‌ గురించే చెప్పింది. మ్యాచ్‌లో జరగని విషయాల గురించి మాట్లాడకూడదు. మ్యాచ్‌ ముగిశాక ఏం జరిగిందో కెమెరాలో రికార్డు కాలేదు. కాబట్టి దీని గురించి కూడా మాట్లాడకూడదు. ఏ మ్యాచ్‌లోనైనా కొన్నిసార్లు అంపైర్‌ నిర్ణయాలు అసంతృప్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా డీఆర్‌ఎస్‌ లేని ఇలాంటి సిరీస్‌లో. మేం కాస్త మెరుగైన అంపైరింగ్‌ను ఆశించాం. కొన్ని నిర్ణయాలు నిరాశ కలిగించాయి. బంతి.. బ్యాట్‌ను తాకిందా? ప్యాడ్‌ను తాకిందా? అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంపైర్‌ వేలు పైకెత్తాడు. దీనిపై ఐసీసీ, బీసీసీఐ, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చర్చిస్తాయని అనుకుంటున్నా. తటస్థ అంపైర్ల విధానం ఉంటే ఇప్పుడిలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. మేం కేవలం క్రికెట్‌ తదితర విషయాలపైనే దృష్టి పెడతాం’’ అని మంధాన తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని