Sanju Samson: శాంసన్‌ స్థానానికి ఎసరు?

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే శుక్రవారం ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడేందుకు బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే బయల్దేరి వెళ్లింది.

Updated : 17 Aug 2023 09:20 IST

జితేశ్‌కు అవకాశం!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే శుక్రవారం ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడేందుకు బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే బయల్దేరి వెళ్లింది. ఈ జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లు.. వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో తలపడే టీమ్‌ఇండియాలోనూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే చాలా అవకాశాలను వృథా చేసుకున్న సంజు శాంసన్‌ను ఈ సిరీస్‌లో ఆడిస్తారా? అన్నది ముఖ్యమైన ప్రశ్నగా మారింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ.. శాంసన్‌ స్థానానికి ఎసరు పెట్టే ఆస్కారముంది. వెస్టిండీస్‌తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడింట్లో బ్యాటింగ్‌ చేసిన శాంసన్‌ వరుసగా 12, 7, 13 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. పైగా విండీస్‌తో సిరీస్‌లో వికెట్ల వెనుక కూడా శాంసన్‌ ఉత్తమంగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతనికి బదులు జితేశ్‌ శర్మ ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. 29 ఏళ్ల మహారాష్ట్ర ఆటగాడు జితేశ్‌.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆకట్టుకున్నాడు. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో పాటు 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఫినిషర్‌ పాత్ర పోషించాడు. ఆసియా క్రీడల్లో జితేశ్‌ను ఆడించేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. అంతకంటే ముందు అతనికి అంతర్జాతీయ అనుభవం కోసం ఐర్లాండ్‌తో మ్యాచ్‌ల్లో బరిలో దింపొచ్చు.   ఒకవేళ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం రింకు సింగ్‌, జితేశ్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు