Asian Games: బంగారు బాణాలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో.. అబ్బురపరిచే పోరాటంతో పసిడి పంట పండిస్తున్నారు. గురువారం దేశానికి మరో రెండు స్వర్ణాలు అందించారు. తెలుగుమ్మాయి జ్యోతి సురేఖ ఈ క్రీడల్లో రెండో పసిడిని ముద్దాడింది.

Updated : 06 Oct 2023 07:40 IST

జ్యోతి త్రయానికి స్వర్ణం
పురుషుల జట్టుకూ పసిడి
స్క్వాష్‌లో దీపిక- హరిందర్‌కు టైటిల్‌
హాంగ్‌జౌ

కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఆర్చరీ ఫైనల్‌. చైనీస్‌ తైపీతో భారత్‌ పోరు. ఏడు సెట్లు ముగిశాయి. 200-200తో స్కోరు సమం. తీవ్ర ఉత్కంఠ. చివరి సెట్‌ మొదలైంది. మన ఆర్చర్లు ముగ్గురూ వరుసగా 10 చొప్పున పాయింట్లు సాధించారు. ఇక ప్రత్యర్థి వంతు. వాళ్లకు తొలి బాణంతో 9 పాయింట్లే రావడంతో భారత్‌కు పసిడి ఖాయమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి వరుసగా పదేసి పాయింట్లు రాబట్టినా ఫలితం లేకపోయింది. భారత్‌ స్వర్ణ సంబరంలో మునిగిపోయింది. ఈ విభాగంలో తొలిసారి ఆసియా క్రీడల పసిడి పట్టేసింది. మహిళల బాటలోనే సాగిన పురుషుల జట్టు బాణాలు గురితప్పలేదు. ఇంకేముంది.. కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగాల్లో మనదే క్లీన్‌స్వీప్‌ (మిక్స్‌డ్‌, పురుషులు, మహిళలు). ఇక స్క్వాష్‌లో దీపిక- హరిందర్‌ చరిత్ర సృష్టిస్తూ స్వర్ణం నెగ్గగా.. సౌరభ్‌ ఘోషల్‌ రజతంతో మెరిశాడు. రెజ్లింగ్‌లో అంతిమ్‌ కంచును ముద్దాడింది. మొత్తం మీద పోటీల 12వ రోజు దేశానికి 5 పతకాలు దక్కాయి.

 

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో.. అబ్బురపరిచే పోరాటంతో పసిడి పంట పండిస్తున్నారు. గురువారం దేశానికి మరో రెండు స్వర్ణాలు అందించారు. తెలుగుమ్మాయి జ్యోతి సురేఖ ఈ క్రీడల్లో రెండో పసిడిని ముద్దాడింది. ఇప్పటికే ఒజాస్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ బంగారు పతకం గెలిచిన ఆమె.. తాజాగా కాంపౌండ్‌ మహిళల టీమ్‌లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. జ్యోతి, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌తో కూడిన భారత్‌ హోరాహోరీగా సాగిన ఫైనల్లో 230-229 తేడాతో చైనీస్‌ తైపీని ఓడించింది. ఈ విజయంలో సీనియర్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది. టీనేజర్లు అదితి, పర్ణీత్‌ కాస్త తడబడ్డా.. సురేఖ మాత్రం 80కి 79 పాయింట్లు సాధించింది. ఫైనల్లో మూడు రౌండ్లు ముగిసే సరికి ఓవరాల్‌గా 171-171తో రెండు జట్లు సమానంగా నిలిచాయి. చివరి రౌండ్లో ఒత్తిడిని సమర్థంగా అధిగమించి భారత ఆర్చర్లు 59 పాయింట్లు గెలిచారు. ప్రత్యర్థి 58కే పరిమితమవడంతో మనవాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిల జట్టు.. ఇప్పుడు రెండు నెలల్లోపే ఆసియా క్రీడల్లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషం. అనంతరం కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ ఫైనల్లో భారత్‌ 235-230తో దక్షిణ కొరియాపై గెలిచింది. ఒజాస్‌ ప్రవీణ్‌, అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌తో కూడిన భారత త్రయం మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు మహిళల వ్యక్తిగత తుదిపోరులో శనివారం చేవాన్‌ (దక్షిణ కొరియా)తో జ్యోతి, పురుషుల ఫైనల్లో ఒజాస్‌తో అభిషేక్‌ తలపడనున్నారు.

అంతిమ్‌కు కాంస్యమే..: భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ కాంస్యంతో సంతృప్తి చెందింది. వరుసగా రెండు సార్లు అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది సీనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం నెగ్గిన 19 ఏళ్ల అంతిమ్‌ భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టింది. కానీ 53 కేజీల క్వార్టర్స్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అకారి ఫుజినామి (జపాన్‌) చేతిలో 0-6తో అంతిమ్‌ ఓడిపోయింది. ఫుజినామి ఫైనల్‌ చేరడంతో రెపిచేజ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న అంతిమ్‌.. కాంస్య పతక పోరులో 3-1తో టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేత బోలోర్తుయా (మంగోలియా)పై గెలిచింది. మరోవైపు ఇతర కాంస్య పతక మ్యాచ్‌ల్లో నవీన్‌ (గ్రీకో రోమన్‌ 130కేజీ) 1-5తో కిమ్‌ (దక్షిణ కొరియా), పూజ (50కేజీ) 2-9తో కీనింజెవా (ఉజ్బెకిస్థాన్‌), మాన్సి (57 కేజీ) 0-2తో సొబిరోవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడిపోయారు.

హాకీ అమ్మాయిలకు షాక్‌..: ఎన్నో ఆశలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత హాకీ మహిళల జట్టు నిరాశపర్చింది. సెమీస్‌లో 0-4తో చైనా చేతిలో ఓడి పసిడికి దూరమవడమే కాకుండా నేరుగా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశమూ కోల్పోయింది. 2018లో రజతం గెలిచిన మన అమ్మాయిలు ఈ సారి పేలవ ప్రదర్శన చేశారు.టోర్నీలోనే అత్యున్నత ర్యాంకు (7) జట్టుగా బరిలో దిగినా.. 12వ ర్యాంకు చైనా చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక కాంస్యం కోసం మన జట్టు శనివారం దక్షిణ కొరియాతో తలపడుతుంది.

కబడ్డీ సెమీస్‌లో భారత్‌ × పాక్‌: కబడ్డీలో భారత పురుషుల జట్టు దూకుడు మీద ఉంది. జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో స్థానం కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం గ్రూప్‌-ఏలో మొదట 50-27తో చైనీస్‌ తైపీని ఓడించి సెమీఫైనల్‌ చేరిన భారత్‌.. చివరి మ్యాచ్‌లో 56-28తో జపాన్‌ను చిత్తు చేసి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అథ్లెటిక్స్‌లో ఆఖరి ఈవెంట్‌ మారథాన్‌లో మాన్‌సింగ్‌, బెలియప్ప నిరాశ పరిచారు. వాళ్లు వరుసగా 8, 12 స్థానాలతో సరిపెట్టుకున్నారు. హాంకాంగ్‌తో బ్రిడ్జ్‌ ఫైనల్లో భారత పురుషుల జట్టు వెనుకంజ వేసింది. తొలి సెషన్‌ను 32-55తో చేజార్చుకున్న భారత్‌.. మొత్తం మీద మూడు సెషన్ల తర్వాత 91-132తో నిలిచింది.


స్క్వాష్‌లో చరిత్ర..

ఆసియా క్రీడల స్క్వాష్‌లో దీపిక పల్లికల్‌- హరిందర్‌పాల్‌ సింగ్‌ జంట చరిత్ర సృష్టించింది. ఆ క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ పసిడి నెగ్గిన మొట్టమొదటి జోడీగా నిలిచింది. ఈ సారి క్రీడల్లోనే స్క్వాష్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఫైనల్లో దీపిక- హరిందర్‌ ద్వయం 2-0 (11-10, 11-10)తో అజ్మన్‌- మహమ్మద్‌ కమల్‌ (మలేసియా)ను చిత్తుచేసింది. 35 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటనను దాటి.. భారత జోడీ వరుస గేమ్‌ల్లో విజయాలు సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ ఘోషల్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో అతను 1-3 (11-9, 9-11, 5-11, 7-11)తో ఇయిన్‌ యావ్‌ (మలేసియా) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌ గెలిచి దూకుడుతో పోరు మొదలెట్టిన సౌరభ్‌ ఆ తర్వాత తడబడ్డాడు. ప్రత్యర్థి సవాలుకు ఎదురు నిలవలేకపోయాడు. ఈ రజతంతో సౌరభ్‌ వరుసగా అయిదు ఆసియా క్రీడల సింగిల్స్‌లోనూ పతకాలు గెలిచిన తొలి భారత స్క్వాష్‌ ఆటగాడయ్యాడు. 2006 నుంచి అతను పతకాలు గెలుస్తున్నాడు. ఈసారి 2 స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యంతో స్క్వాష్‌లోనూ భారత్‌ ఉత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2014లో స్క్వాష్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు, ఓ కాంస్యం వచ్చాయి.


ఆసియా క్రీడల్లో ఈనాడు

క్రికెట్‌: పురుషుల సెమీఫైనల్‌, భారత్‌ × బంగ్లాదేశ్‌, ఉ.6.30 నుంచి; బ్యాడ్మింటన్‌: ప్రణయ్‌, పురుషుల సింగిల్స్‌ సెమీస్‌, ఉ.6.30 నుంచి; సాత్విక్‌-చిరాగ్‌, పురుషుల డబుల్స్‌ సెమీస్‌, ఉ.6.30 నుంచి; రెజ్లింగ్‌: బజ్‌రంగ్‌ పునియా (65 కేజీల ఫ్రీస్టయిల్‌) అమన్‌ సెహ్రావత్‌ (57 కేజీ); సోనమ్‌ మలిక్‌ (68 కేజీ), రాధిక (68 కేజీ), ఉ.7.30 నుంచి; కబడ్డీ: మహిళల సెమీస్‌ భారత్‌ × నేపాల్‌, ఉ.7 నుంచి; పురుషుల సెమీస్‌ భారత్‌ × పాకిస్థాన్‌, మ.12.30 నుంచి; హాకీ: పురుషుల ఫైనల్‌ భారత్‌ × జపాన్‌, సా.4 నుంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు