AFG vs SA: గెలుపు సఫారీ

సెమీస్‌ మీద ఆశల్లేవ్‌.. అయినా అఫ్గానిస్థాన్‌ అంత సులువుగా వదల్లేదు. మొదట బ్యాటింగ్‌లో తడబాటు.. అయినా మెరుగైన స్కోరుతో చివరి వరకూ పోరాడింది. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకను ఓడించి.. ఆస్ట్రేలియాను భయపెట్టి ఈ ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకున్న అఫ్గాన్‌..

Updated : 11 Nov 2023 07:10 IST

దక్షిణాఫ్రికా ఏడో విజయం
పోరాడి ఓడిన అఫ్గానిస్థాన్‌

సెమీస్‌ మీద ఆశల్లేవ్‌.. అయినా అఫ్గానిస్థాన్‌ అంత సులువుగా వదల్లేదు. మొదట బ్యాటింగ్‌లో తడబాటు.. అయినా మెరుగైన స్కోరుతో చివరి వరకూ పోరాడింది. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకను ఓడించి.. ఆస్ట్రేలియాను భయపెట్టి ఈ ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకున్న అఫ్గాన్‌.. తన చివరి మ్యాచ్‌లోనూ మార్కు చూపించింది. స్పిన్‌ దాడితో సఫారీ జట్టును బెంబేలెత్తించి.. మరో సంచలనం అందుకునేలా కనిపించింది. కానీ డసెన్‌ పట్టుదలకు.. డికాక్‌, ఫెలుక్వాయో మెరుపులు తోడవడంతో దక్షిణాఫ్రికానే గెలిచింది.

అహ్మదాబాద్‌ : ప్రపంచకప్‌లో ఏడో విజయంతో లీగ్‌ దశను దక్షిణాఫ్రికా ముగించింది. శుక్రవారం 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై(AFG vs SA) గెలిచింది. మొదట అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (97 నాటౌట్‌; 107 బంతుల్లో 7×4, 3×6) పోరాటంతో అఫ్గానిస్థాన్‌ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కొయెట్జి (4/44), కేశవ్‌ మహరాజ్‌ (2/25), ఎంగిడి (2/69) కలిసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వాండర్‌ డసెన్‌ (76 నాటౌట్‌; 95 బంతుల్లో 6×4, 1×6) జట్టును గెలిపించాడు. డికాక్‌ (41), ఫెలుక్వాయో (39 నాటౌట్‌) కూడా రాణించారు. అఫ్గాన్‌ స్పిన్నర్లు మహమ్మద్‌ నబి (2/35), రషీద్‌ ఖాన్‌ (2/37) ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో డికాక్‌ ఆరు క్యాచ్‌లు పట్టడం విశేషం.
తడబాటు దాటి..: మొదట బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేసి గెలవడమే దక్షిణాఫ్రికా జోరుకు కారణం. ఛేదన ఎదురైతే మాత్రం కంగారే. ఈ కప్పులో ఆ జట్టు ఓడిన రెండు మ్యాచ్‌లూ (నెదర్లాండ్స్‌, భారత్‌) ఛేదనలోనే. పాకిస్థాన్‌తో ఛేదనలో ఒక్క వికెట్‌ తేడాతో గట్టెక్కింది. ఈ బలహీనత తెలిసే అఫ్గాన్‌ ఆ జట్టును ఛేదనకు దించింది. ఊహించినట్లుగానే సఫారీ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. అఫ్గాన్‌ స్పిన్‌ దెబ్బకు విలవిలలాడింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న డికాక్‌ మరోసారి అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొడుతుండటంతో దక్షిణాఫ్రికా 10 ఓవర్లకు 57/0తో నిలిచింది. అప్పటికే రెండు వైపుల నుంచి స్పిన్నర్లతో దాడి పెంచిన అఫ్గాన్‌ స్వల్ప వ్యవధిలో బవుమా, డికాక్‌ వికెట్లు సాధించింది. డసెన్‌, మార్‌క్రమ్‌ (25) కలిసి మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో సఫారీ జట్టుకు ఇబ్బంది లేదనిపించింది. కానీ ఛేదనలో ఇలా అలవోకగా నెగ్గితే అది సఫారీ జట్టు ఎందుకవుతుంది? పోరాటం లేకుండా మ్యాచ్‌ ఇచ్చేస్తే అది అఫ్గాన్‌ ఎందుకవుతుంది? బంతిబంతికీ ప్రమాదకరంగా మారిన రషీద్‌ ఖాన్‌.. మార్‌క్రమ్‌తో పాటు క్లాసెన్‌ (10)ను ఔట్‌ చేసి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. అక్కడి నుంచి అఫ్గాన్‌ మరింత పట్టుబిగించేందుకు ప్రయత్నించింది. స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డసెన్‌ పట్టుదలతో నిలబడ్డాడు. ఎంతో ఓపికతో బ్యాటింగ్‌ చేశాడు. మిల్లర్‌ (24) కూడా అతనికి సహకరించడంతో 37 ఓవర్లకు 182/4తో నిలిచిన దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగింది. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన నబి ఓవర్లో షాట్‌ కోసం తొందరపడి మిల్లర్‌ వికెట్‌ పారేసుకోవడం.. ఇక ప్రధాన బ్యాటర్లెవరూ లేకపోవడంతో ఉత్కంఠ రేగింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఫెలుక్వాయో.. డసెన్‌కు గొప్ప మద్దతునిచ్చాడు. బంతి కాళ్లకు తగిలింది, గాల్లోకి లేచింది.. ఇలా ఏ క్షణమైనా వికెట్‌ పడగొట్టేలా అఫ్గాన్‌ కనిపించింది. కానీ ఈ ఇద్దరూ కలిసి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మధ్యలో ఆరు ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగినా ఒత్తిడికి గురికాకుండా డసెన్‌, ఫెలుక్వాయో ఆడారు. ఆఖర్లో పేసర్‌ నవీన్‌ బౌలింగ్‌కు రావడంతో సిక్సర్లతో చెలరేగిన ఫెలుక్వాయో.. అప్పటివరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. 47వ ఓవర్లో వరుసగా 6,  4, 6 కొట్టి మ్యాచ్‌ ముగించాడు.

అజ్మతుల్లా ఒక్కడే..: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా (291), ఇంగ్లాండ్‌ (284), భారత్‌ (272)పై మొదట బ్యాటింగ్‌లో సత్తాచాటిన అఫ్గానిస్థాన్‌.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మందకొడి పిచ్‌పైనా పోరాడే స్కోరు సాధించింది. అజ్మతుల్లా ఇన్నింగ్స్‌కు ఇరుసుగా మారి జట్టును ఆదుకున్నాడు. పట్టుదలగా చివరి వరకూ క్రీజులో నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు గుర్బాజ్‌ (25), జద్రాన్‌ (15) 8 ఓవర్ల వరకూ వికెట్‌ పడనివ్వలేదు. కానీ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బంతి అందుకోగానే అంతా తలకిందులైంది. తన వరుస ఓవర్లలో గుర్బాజ్‌తో పాటు కెప్టెన్‌ హష్మతుల్లా (2)ను మహరాజ్‌ ఔట్‌ చేశాడు. మధ్య ఓవర్లో జద్రాన్‌ను కొయెట్జి వెనక్కిపంపాడు. మూడు ఓవర్ల వ్యవధిలో నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ 45/3తో కష్టాల్లో పడింది. ఆ దశలో అజ్మతుల్లా నిలబడ్డాడు. రహ్మత్‌ (26)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. చీలమండ నొప్పితో మైదానం వీడి తిరిగొచ్చిన ఎంగిడి.. మిల్లర్‌ తడబడుతూ పట్టిన క్యాచ్‌తో రహ్మత్‌ను వెనక్కి పంపి అఫ్గాన్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత కొయెట్జి పేస్‌కు బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. క్రీజులోకి రావడం.. వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించడం ఇదే వరస. కానీ మరో ఎండ్‌లో పోరాడిన అజ్మతుల్లా.. రషీద్‌ (14)తో ఏడో వికెట్‌కు 44, నూర్‌ అహ్మద్‌ (26)తో ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఆపద్బాంధవుడిలా నిలిచాడు. కానీ వన్డేల్లో తొలి శతకానికి మూడు పరుగులు దూరంలో అజేయంగా నిలిచిపోయాడు. భారీ స్కోరు చేయలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌ ముగిసే సరికి ఏ మూలో ఉన్న అఫ్గాన్‌ సెమీస్‌ ఆశలు కూలాయి.

6

ఈ మ్యాచ్‌లో డికాక్‌ అందుకున్న క్యాచ్‌లు. వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో ఇన్ని క్యాచ్‌లు అందుకున్న మూడో వికెట్‌కీపర్‌గా అతను నిలిచాడు. గిల్‌క్రిస్ట్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ ముందున్నారు.

అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్‌ (సి) క్లాసెన్‌ (బి) మహరాజ్‌ 25; జద్రాన్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జి 15; రహ్మత్‌ (సి) మిల్లర్‌ (బి) ఎంగిడి 26; హష్మతుల్లా (సి) డికాక్‌ (బి) మహరాజ్‌ 2; అజ్మతుల్లా నాటౌట్‌ 97; ఇక్రమ్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జి 12; నబి (సి) డికాక్‌ (బి) ఎంగిడి 2; రషీద్‌ (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 14; నూర్‌ అహ్మద్‌ (సి) డికాక్‌ (బి) కొయెట్జి 26; ముజీబ్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) కొయెట్జి 8; నవీనుల్‌ హక్‌ రనౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్‌) 244; వికెట్ల పతనం: 1-41, 2-41, 3-45, 4-94, 5-112, 6-116, 7-160, 8-204, 9-226; బౌలింగ్‌: రబాడ 10-0-40-0; ఎంగిడి 8.3-0-69-2; మార్‌క్రమ్‌ 4.3-0-25-0; కొయెట్జి 10-1-44-4; కేశవ్‌ మహరాజ్‌ 10-1-25-2; ఫెలుక్వాయో 7-0-36-1
దక్షిణాఫ్రికా: డికాక్‌ ఎల్బీ (బి) నబి 41; బవుమా (సి) గుర్బాజ్‌ (బి) ముజీబ్‌ 23; డసెన్‌ నాటౌట్‌ 76; మార్‌క్రమ్‌ (సి) నవీనుల్‌ (బి) రషీద్‌ 25; క్లాసెన్‌ (బి) రషీద్‌ 10; మిల్లర్‌ (సి) అండ్‌ (బి) నబి 24; ఫెలుక్వాయో నాటౌట్‌ 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (47.3 ఓవర్లలో 5 వికెట్లకు) 247; వికెట్ల పతనం: 1-64, 2-66, 3-116, 4-139, 5-182; బౌలింగ్‌: ముజీబ్‌ రెహ్మాన్‌ 10-0-51-1; నవీనుల్‌ హక్‌ 6.3-0-52-0; నబి 10-1-35-2; అజ్మతుల్లా 1-0-8-0; రషీద్‌ ఖాన్‌ 10-1-37-2; నూర్‌ అహ్మద్‌ 9-0-49-0; రహ్మత్‌ 1-0-12-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని