ODI World Cup 2023: టాస్‌ గెలిస్తే బ్యాటింగే..!

ప్రపంచకప్‌లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌, గురువారం రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పుడు ఈ సెమీస్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలపైనా చర్చ కొనసాగుతోంది.

Updated : 14 Nov 2023 07:13 IST

ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచకప్‌లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌, గురువారం రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పుడు ఈ సెమీస్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలపైనా చర్చ కొనసాగుతోంది. వాంఖడే, ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌లు ఎవరికి అనుకూలిస్తాయి? పరుగుల వరద పారుతుందా? వికెట్ల హోరు సాగుతుందా? అనే ఆసక్తి నెలకొంది.

పరుగుల వరదే!

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీస్‌కు వేదికగా నిలిచే ముంబయిలోని వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకూ ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ రెండు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌పై 399/7, బంగ్లాదేశ్‌పై 382/5 పరుగులు సాధించింది. శ్రీలంకపై టీమ్‌ఇండియా 357/8 స్కోరు సాధించింది. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ 291/5 స్కోరు చేయగా.. ఛేదనలో మ్యాక్స్‌వెల్‌ అద్భుత ద్విశతకంతో కంగారూ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్‌ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి. మొదట బ్యాటింగ్‌లో   భారీ స్కోరు చేయొచ్చు. ఈ ఎర్రమట్టి పిచ్‌ ఆట సాగుతున్నా కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారముంది.

సమానంగా..

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్‌ జరిగే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సమానంగా సహకరించే అవకాశాలున్నాయి. ఈ టోర్నీలో ఇక్కడ మొదట బంగ్లాదేశ్‌పై 229 పరుగులు చేసిన నెదర్లాండ్స్‌.. అనంతరం ప్రత్యర్థిని 142కే ఆలౌట్‌ చేసింది. మరో మ్యాచ్‌లో మొదట బంగ్లా 204 చేయగా.. పాకిస్థాన్‌ 32.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్‌ 326/5 భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగి సఫారీ జట్టును 83కే కుప్పకూల్చింది. పాకిస్థాన్‌పై ఆసీస్‌ 337/9 స్కోరు చేసి 93 పరుగుల తేడాతో గెలిచింది. ఈ స్కోర్లు చూస్తే ఇక్కడి పిచ్‌ మొదట బ్యాటింగ్‌కు, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు సహకరించేలా కనిపిస్తోంది. అయితే బలమైన బౌలింగ్‌ ఉంటే మొదట కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం ఉంది.


ఇప్పుడు కప్‌ గెలవకపోతే..

‘‘ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారత్‌ ప్రదర్శనతో అభిమానులు ఊగిపోతున్నారు. గత కప్‌ను  12 ఏళ్ల క్రితం స్వదేశంలోనూ టీమ్‌ఇండియా గెలిచింది. భారత్‌కు మళ్లీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో వాళ్లకిదే మంచి ఛాన్స్‌. ఈసారి అవకాశం కోల్పోతే మళ్లీ విజేతగా నిలిచే స్థాయికి వెళ్లడానికి మరో మూడు ప్రపంచకప్‌ల సమయం పట్టొచ్చు. ఎందుకంటే జట్టులో 7-8 మంది ఆటగాళ్లు కెరీర్‌ చరమాంకంలో ఉన్నారు. బహుశా ఇదే వారికి చివరి ప్రపంచకప్‌ కావొచ్చు’’ 

రవిశాస్త్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని