India vs Australia: బౌలింగా.. బ్యాటింగా..?

ఆదివారం అహ్మదాబాద్‌లో భారత్‌, ఆస్ట్రేలియా ఫైనల్‌ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌పై చర్చ జోరందుకుంది. ఈ మైదానంలో 11 పిచ్‌లున్నాయి. ఒకటి నుంచి అయిదు పిచ్‌లు నల్లమట్టితో కూడినవి.

Updated : 18 Nov 2023 08:29 IST

అహ్మదాబాద్‌ : ఆదివారం అహ్మదాబాద్‌లో భారత్‌, ఆస్ట్రేలియా(India vs Australia) ఫైనల్‌ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌పై చర్చ జోరందుకుంది. ఈ మైదానంలో 11 పిచ్‌లున్నాయి. ఒకటి నుంచి అయిదు పిచ్‌లు నల్లమట్టితో కూడినవి. వీటిపై బౌన్స్‌ లభిస్తుంది. ఎర్రమట్టితో కూడిన 6 నుంచి 11 పిచ్‌లు త్వరగా మందకొడిగా మారతాయి. ఈ ఫైనల్‌ నల్లమట్టి పిచ్‌పైనే జరిగే అవకాశముంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకైతే ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా సహకరించింది. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఛేదనలో జట్లు మూడు నెగ్గాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా చేసిన 286 పరుగులే ఈ టోర్నీలో ఇక్కడ అత్యధిక స్కోరు. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మొదట 282 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పాకిస్థాన్‌ను మొదట 191 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌.. ఛేదనలో మూడు వికెట్లే కోల్పోయి 30.3 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగించింది. ఓవరాల్‌గా ఇప్పటివరకూ ఇక్కడ 32 వన్డేలు జరిగితే.. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 17, ఛేదన జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచాయి. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 237 మాత్రమే.

ఆ వివాదం..: న్యూజిలాండ్‌తో భారత్‌ సెమీస్‌ కోసం వాంఖడేలో చివరి నిమిషంలో తాజా పిచ్‌కు బదులు వాడిన పిచ్‌పై మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కానీ తాజా పిచ్‌పైనే మ్యాచ్‌ నిర్వహించాలనే నిబంధన ఏమీ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీ పిచ్‌ సలహాదారు ఆండీ అట్కిన్సన్‌ ఈ పిచ్‌ను ఇంకా పరిశీలించలేదు. దీంతో పిచ్‌ సన్నాహకాలను బీసీసీఐ క్యూరేటర్లు చూసుకుం  టున్నారు. సెమీస్‌ పిచ్‌ విషయంలో అట్కిన్సన్‌కు బీసీసీఐకి మధ్య పడలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం పిచ్‌ను అట్కిన్సన్‌ పరిశీలించే అవకాశముంది. శుక్రవారం ఇద్దరు బీసీసీఐ సీనియర్‌ క్యూరేటర్లు ఆశిష్‌ భౌమ్నిక్‌, తపోష్‌ ఛటర్జీ.. బీసీసీఐ జీఎం (దేశవాళీ క్రికెట్‌) అభయ్‌ కురువిల్లాతో కలిసి పిచ్‌ సన్నాహకాలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే ఫైనల్‌ కోసం తాజా పిచ్‌ను సిద్ధం చేస్తున్నారా? లేదా ఇప్పటికే ఉపయోగించిన దాన్ని వాడబోతున్నారా? అనేదానిపై స్పష్టత లేదు. పిచ్‌పై భారీ రోలర్‌ను తిప్పడం కనిపించింది. మందకొడి బ్యాటింగ్‌ ట్రాక్‌ను రూపొందించే పనిలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛేదనలో బ్యాటింగ్‌ చేసే జట్టుకు పరిస్థితులు క్లిష్టంగా మారతాయని, 315 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చని గుజరాత్‌ రాష్ట్ర సంఘం క్యూరేటర్‌ ఒకరు చెప్పారు. మరోవైపు పిచ్‌ను పరిశీలించిన రోహిత్‌, ద్రవిడ్‌ అనంతరం క్యూరేటర్లతో చర్చించారు. ఇక ఫైనల్‌ నేపథ్యంలో రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా నెట్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని