SKY: సూర్య సారథ్యంలో ఆసీస్‌తో టీ20లకు

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన టీమ్‌ఇండియా.. అదే జట్టుతో ఇంకో రెండు రోజుల్లో టీ20 సిరీస్‌ ఆరంభించనుంది.

Updated : 22 Nov 2023 13:53 IST

విశాఖలో 23న తొలి మ్యాచ్‌

దిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన టీమ్‌ఇండియా.. అదే జట్టుతో ఇంకో రెండు రోజుల్లో టీ20 సిరీస్‌ ఆరంభించనుంది. ఈ గురువారం నుంచి రెండు జట్లూ అయిదు టీ20ల్లో తలపడబోతుండగా.. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. ఈ సిరీస్‌లోనూ ఆడరు. ఏడాదిగా టీ20ల్లో జట్టును నడిపిస్తున్న హార్దిక్‌ పాండ్య గాయంతో వన్డే ప్రపంచకప్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్‌కెప్టెన్‌ సూర్యకుమార్‌ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

హైదరాబాదీ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ సహా ఆ క్రీడల్లో ఆడిన మెజారిటీ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌ ఆడలేకపోయిన అక్షర్‌ పటేల్‌ ఈ సిరీస్‌లో ఆడనుండగా.. కప్పులో జట్టు సభ్యులుగా ఉన్న ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు కూడా అవకాశం దక్కింది. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అదరగొట్టిన రియాన్‌ పరాగ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ప్రపంచకప్‌లో రెగ్యులర్‌ ఆటగాడిగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ తొలి మూడు టీ20లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్‌లకు అతను వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్‌ జరగనుండగా.. తర్వాత వరుసగా 26న తిరువనంతపురం, 28న గువాహటి, డిసెంబరు 1న రాయ్‌పుర్‌, 3న బెంగళూరు మిగతా మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

భారత జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని