OneDay Format: వన్డేల భవితవ్యమేంటి?

భారత్‌లో ప్రపంచకప్‌ ముగిసింది. ఫైనల్లో టీమ్‌ఇండియా ఓడిందనే బాధను పక్కన పెడితే.. టోర్నీ మన దేశంలో గొప్పగా సాగింది. వన్డేలకు ఆదరణ తగ్గిపోతుందనుకునే సమయంలో ఈ ప్రపంచకప్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.

Updated : 22 Nov 2023 08:03 IST

ఫార్మాట్‌ మారుతుందా?

భారత్‌లో ప్రపంచకప్‌ ముగిసింది. ఫైనల్లో టీమ్‌ఇండియా ఓడిందనే బాధను పక్కన పెడితే.. టోర్నీ మన దేశంలో గొప్పగా సాగింది. వన్డేలకు ఆదరణ తగ్గిపోతుందనుకునే సమయంలో ఈ ప్రపంచకప్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడే భారత్‌లో ఈ టోర్నీ జరిగింది కాబట్టే ఈ మాత్రం విజయవంతమైంది. మరి ఇప్పుడు వన్డేల పరిస్థితేంటి? అవి మనుగడ సాగిస్తాయా? నాలుగేళ్ల తర్వాత భారత్‌ వెలుపల జరిగే ప్రపంచకప్‌కు ఆదరణ ఉంటుందా?

ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచ క్రికెట్‌కు గుండె చప్పుడు భారత్‌ అనడంలో సందేహం లేదు. మన దేశంలో జరిగిన ప్రపంచకప్‌కు లభించిన ఆదరణే అందుకు నిదర్శనం. చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు స్టేడియాల్లో వీక్షించిన ప్రపంచకప్‌గా ఇది రికార్డు నమోదు చేయడం విశేషం. 45 రోజుల పాటు సాగిన టోర్నీలో మ్యాచ్‌లను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా భారత్‌ ఆడిన మ్యాచ్‌లకైతే స్టేడియాలు నిండిపోయాయి. ప్రపంచకప్‌ అది కూడా భారత్‌లో జరిగింది కాబట్టే ఈ పరిస్థితి ఉంది. మరి ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇంతటి ఆదరణ ఉంటుందా? అంటే సందేహమే. వన్డేల్లో జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లు, మ్యాచ్‌ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గతంలో ఓ జట్టు ఏడాదికి 50 వరకు వన్డేలాడేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 ప్రపంచకప్‌కు ముందు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగంగా భారత్‌ 30 వన్డేలు మాత్రమే ఆడనుంది. మిగతా జట్లూ ఇంతకంటే ఎక్కువ వన్డేలాడకపోవచ్చు. 2019 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడ్డ ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌.. మళ్లీ వన్డేలో ఢీకొట్టింది ఈ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లోనే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 2024, 2026లో టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో జట్ల దృష్టి మొత్తం పొట్టి ఫార్మాట్‌పైనే ఉంటుందనడంలో సందేహం లేదు. మళ్లీ 2027లో వన్డే ప్రపంచకప్‌ ఉంది. అయినా ఈ టోర్నీ దక్షిణాఫ్రికా,  నమీబియా, జింబాబ్వే దేశాల్లో జరగబోతుండటంతో ఆదరణ లభిస్తుందో లేదో అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడే వన్డే మ్యాచ్‌ కోసం 8 గంటల సమయం గడిపేందుకు జనాలు పెద్దగా ఇష్టపడటం లేదు. నాలుగేళ్లకు పరిస్థితి మరింత క్షీణిస్తుందనే చెప్పాలి.

న్డేలు బతకాలంటే ఫార్మాట్‌ మార్చాలని దిగ్గజాలు సూచిస్తున్నారు. ఇన్నింగ్స్‌కు 50 చొప్పున 100 ఓవర్ల మ్యాచ్‌ కాకుండా కొత్త విధానంలో వన్డేలు నిర్వహించాలంటున్నారు. 25 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్‌లుగా వన్డే మ్యాచ్‌ను విభజించాలని సచిన్‌ చెబుతున్నాడు. మొదట 25 ఓవర్ల పాటు ‘ఎ’ జట్టు బ్యాటింగ్‌ చేస్తే, తర్వాతి 25 ఓవర్లు ‘బి’ బ్యాటింగ్‌కు దిగాలని.. అనంతరం ‘ఎ’ జట్టు స్కోరు ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి కొనసాగిస్తూ 25 ఓవర్లు ఆడాలని, చివరగా ‘బి’ జట్టు ఛేదన చేయాలని సచిన్‌ పేర్కొన్నాడు. మËరోవైపు ఇన్నింగ్స్‌కు 40 ఓవర్ల చొప్పున వన్డేలను కుదించాలని వసీం అక్రమ్‌ సూచించాడు. ప్రస్తుతం ఓ వన్డే ఇన్నింగ్స్‌లో తొలి, చివరి 10 ఓవర్లు మాత్రమే ఆసక్తితో చూస్తున్నారు. మధ్యలో 30 ఓవర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌ను మార్చేందుకు ఐసీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. మరోవైపు ప్రపంచకప్‌కు ఏడాది ముందు నుంచే వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాలని ఐసీసీకి క్రికెట్‌ చట్టాలు పర్యవేక్షించే మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) సూచించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు