Sunil Gavaskar: భారత్‌కు విరాట్‌బాల్‌ ఉంది: సునీల్‌ గావస్కర్‌

త్వరలో జరిగే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహంతో బరిలో దిగితే.. ఎదుర్కోవడానికి భారత్‌కు ‘విరాట్‌బాల్‌’ ఉందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.

Updated : 22 Jan 2024 08:52 IST

ముంబయి: త్వరలో జరిగే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహంతో బరిలో దిగితే.. ఎదుర్కోవడానికి భారత్‌కు ‘విరాట్‌బాల్‌’ ఉందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. జనవరి 25న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విరాట్‌ కోహ్లికి మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో అతడికి దాదాపు అర్ధసెంచరీలతో సమానంగా సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ను సవాల్‌ చేయడానికి భారత్‌కు విరాట్‌బాల్‌ ఉంది’’ అని సన్నీ అన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా లాంటి భారత స్పిన్నర్లను ఎదుర్కొని ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహం అమలు చేయగలదా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోందని అతడు పేర్కొన్నాడు. ‘‘గత రెండేళ్లుగా టెస్టు క్రికెట్లో బజ్‌బాల్‌ పేరిట ఇంగ్లాండ్‌ దూకుడుగా ఆడుతోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి బ్యాటర్‌ ధాటిగా ఆడుతున్నారు. అయితే ఇదే వ్యూహం భారత్‌ స్పిన్నర్లపై పని చేస్తుందా అనేది ఆసక్తికరం’’ అని సన్నీ అన్నాడు. విరాట్‌కు ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉంది. అతడు ఆ జట్టుపై 28 టెస్టుల్లో 1991 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని