ముంబయి తప్ప..

ఐపీఎల్‌-17 లీగ్‌ దశలో ఇంకా 13 మ్యాచ్‌లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్‌ చేరలేదు. లఖ్‌నవూపై సన్‌రైజర్స్‌ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Published : 09 May 2024 02:23 IST

పీఎల్‌-17 లీగ్‌ దశలో ఇంకా 13 మ్యాచ్‌లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్‌ చేరలేదు. లఖ్‌నవూపై సన్‌రైజర్స్‌ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు ముందంజ వేసే ఆవకాశాలు ఇక లేవు. ప్రస్తుతం తలో 12 పాయింట్లతో ఉన్న లఖ్‌నవూ, దిల్లీ మధ్య ఓ మ్యాచ్‌ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా పాయింట్లు 14 అవుతాయి. రద్దయినా 13 పాయింట్లతో ముంబయి కన్నా మెరుగైన స్థితిలో ఉంటాయి. మిగిలిన 9 జట్లూ రేసులో ఉన్నాయనే చెప్పాలి. చెరో 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదేసి విజయాలతో 16 పాయింట్లు సాధించి వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపుగా ఖాయమే! మరో విజయం సాధిస్తే ఈ రెండు జట్లకూ తిరుగుండదు. లఖ్‌నవూపై భారీ విజయంతో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకున్న సన్‌రైజర్స్‌ కూడా ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. 12 మ్యాచ్‌ల్లో ఏడో గెలుపుతో మూడో స్థానానికి ఎగబాకిన సన్‌రైజర్స్‌ మరో మ్యాచ్‌ నెగ్గితే ముందంజ వేయొచ్చు. తన చివరి రెండు మ్యాచ్‌లనూ (గుజరాత్‌, పంజాబ్‌తో) సొంతగడ్డపైనే ఆడబోతుండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఇక చెన్నై, దిల్లీ, లఖ్‌నవూ తలో 12 పాయింట్లతో ఉన్నాయి. కానీ దిల్లీ, లఖ్‌నవూ (12 మ్యాచ్‌లు) కంటే ఓ మ్యాచ్‌ తక్కువే ఆడిన చెన్నైకు ముందంజ వేసేందుకు మరింత మెరుగైన అవకాశాలున్నాయి. 11 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, పంజాబ్‌, గుజరాత్‌ ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సాంకేతికంగా ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నా.. నెట్‌ రన్‌రేట్‌, ఇతర జట్ల ఫలితాలపై ఈ మూడు ఫ్రాంఛైజీలు ఆధారపడాల్సి ఉంటుంది. లీగ్‌ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుందనే సంగతి తెలిసిందే. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌ చేరతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని