సంగీతం వింటూ.. సిరీస్‌లు చూస్తూ

ఒలింపిక్స్‌ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్‌ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్‌ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు.

Published : 09 May 2024 02:22 IST

దిల్లీ: ఒలింపిక్స్‌ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్‌ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్‌ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడబోతున్న బాక్సింగ్‌ సంచలనం నిఖత్‌ జరీన్‌ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం సంగీతం వింటానని, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తానని చెబుతోంది. ప్రస్తుతం పటియాలాలో సాధన కొనసాగిస్తున్న ఈ 27 ఏళ్ల తెలంగాణ బాక్సర్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో కచ్చితంగా పతకం గెలుస్తుందనే అంచనాలున్నాయి. ‘‘త్వరలోనే ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్నానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఎల్లప్పుడూ మంచి ప్రదర్శనపై ధ్యాస పెట్టేలా మెదడుకు శిక్షణనిస్తుంటా. ప్రతి టోర్నీతో ఒత్తిడి ఏర్పడుతూనే ఉంటుంది. మనతో పాటు మన చుట్టూ ఉండేవాళ్లకూ మనపై అంచనాలుంటాయి. ఇవన్నీ కలిపి మెదడుపై అదనపు భారాన్ని మోపుతాయి. దీన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాలి. ధ్యాస మరల్చకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏకాగ్రత చెదరకూడదు. అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నా. అలాగే జనాల నుంచి కూడా కాస్త దూరం పాటిస్తున్నా. ఇప్పుడు నేను శక్తిని కాపాడుకునే స్థితిలో ఉన్నా. అలాగే కొన్నిసార్లు తీపి పదార్థాలూ తింటున్నా. సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నా. సంగీతం వింటున్నా. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నా. ప్రస్తుతం ‘హీరామండీ’ సిరీస్‌ చూస్తున్నా. అది ఆసక్తికరంగా ఉంది. ఇలా మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటున్నా’’ అని రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ చెప్పింది. ‘‘టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఎంత బలంగా కోరుకున్నానో అందరికీ తెలుసు. కానీ అది జరగలేదు. ఆ ఎదురుదెబ్బ నన్ను దృఢంగా మార్చింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రోజు కలిగిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఓ ప్రధానమైన కల నిజమైనట్లు అనిపించింది. కానీ ఇప్పటికీ సగం పని మాత్రమే పూర్తయింది. రింగ్‌లో ఒంటరిగానే పోరాడాలి. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో సాగాలి. ఇదే నా ప్రయాణం. నొప్పిని భరించాల్సిందే’’ అని నిఖత్‌ పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో దిగ్గజం మేరీకోమ్‌ చేతిలో నిఖత్‌ ఓడిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని