అమన్‌పై ఆశలు

ప్రపంచ రెజ్లింగ్‌ క్వాలిఫయర్స్‌ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్‌. భారత ఫ్రీస్టైల్‌ రెజ్లర్లలో అమన్‌ శెరావత్‌, దీపక్‌ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి.

Published : 09 May 2024 02:15 IST

నేటి నుంచే రెజ్లింగ్‌ ప్రపంచ క్వాలిఫయర్స్‌

ఇస్తాంబుల్‌: ప్రపంచ రెజ్లింగ్‌ క్వాలిఫయర్స్‌ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్‌. భారత ఫ్రీస్టైల్‌ రెజ్లర్లలో అమన్‌ శెరావత్‌, దీపక్‌ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌ అయిన అమన్‌ (57కేజీ).. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ లేదా ఆసియా క్వాలిఫయర్స్‌లోనే పారిస్‌కు అర్హత సాధిస్తాడని అంతా భావించినా అతడు విఫలమయ్యాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ రజత విజేతలు పునియా (86 కేజీ), సుజీత్‌ కల్కల్‌ (65 కేజీ)లు భారీ వర్షాలతో దుబాయ్‌లో చిక్కుకుపోవడం వల్ల బిష్కెక్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో పోటీపడలేకపోయారు. ఇక చివరి అవకాశాన్ని వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. ఈ టోర్నీలో ప్రతి విభాగంలో ఫైనస్టులకు ఒలింపిక్‌ కోటా స్థానాలు లభిస్తాయి. ఇద్దరు కాంస్య పతక విజేతల మధ్య బౌట్లో నెగ్గిన రెజ్లర్‌ కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. ప్రపంచ క్వాలిఫయర్స్‌ ఫ్రీస్టైల్‌లో భారత్‌ నుంచి ఇంకా జైదీప్‌ (74కేజీ), దీపక్‌ (97కేజీ), సుమిత్‌ (125కేజీ) పోటీపడనున్నారు. మహిళల ఫ్రీస్టైల్‌లో మాన్సీ అహ్లావత్‌ (62కేజీ), నిషా దహియా (68కేజీ) అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్‌కు ఇప్పటివరకు రెజ్లింగ్‌లో నాలుగు పారిస్‌ ఒలింపిక్‌ కోటా స్థానాలు లభించాయి. అన్నీ మహిళల విభాగంలోనే.


క్వార్టర్స్‌లో మనిక

జెద్దా: సౌదీ స్మాష్‌ టీటీ టోర్నీలో భారత స్టార్‌ ప్యాడ్లర్‌ మనిక బత్రా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో మనిక 11-6, 11-9, 11-7తో మిటెల్‌హమ్‌(జర్మనీ)పై విజయం సాధించింది. మిటెల్‌హమ్‌పై నాలుగు ప్రయత్నాల్లో మనికకు ఇదే తొలి గెలుపు.


ఐర్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ కెప్టెన్‌గా స్టిర్లింగ్‌

డబ్లిన్‌: టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే ఐర్లాండ్‌ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యుల జట్టుకు వెటరన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ నాయకత్వం వహించనున్నాడు. ఆండ్రూ బాల్‌బిర్నీ, డాక్రెల్‌ వంటి అనుభవజ్ఞులు ఐర్లాండ్‌ జట్టులో ఉన్నారు. గ్రూప్‌-ఎ లో ఉన్న ఐర్లాండ్‌, తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న భారత్‌తో తలపడుతుంది. పాకిస్థాన్‌, కెనడా, అమెరికాలు గ్రూప్‌లోని ఇతర జట్లు.

ఐర్లాండ్‌ జట్టు: పాల్‌ స్టిర్లింగ్‌, మార్క్‌ అడైర్‌, రాస్‌ అడైర్‌, బాల్‌బిర్నీ, కాంఫర్‌, గారెత్‌ డెలాని, డాక్రెల్‌, గ్రాహమ్‌ హ్యూమ్‌, జోష్‌ లిటిల్‌, బారీ మెకార్తి, నీల్‌ రాక్‌, హ్యారీ టెక్టర్‌, టకర్‌, బెన్‌   వైట్‌, క్రెయిగ్‌ యంగ్‌.


మంగోలియా 12కే ఆలౌట్‌

సానో (జపాన్‌): ఏడు నెలల కింద ఆసియా క్రీడలతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జపాన్‌ అదరగొట్టింది. టీ20 మ్యాచ్‌లో మంగోలియాను 12 పరుగులకే కుప్పకూల్చింది. ఇది టీ20 క్రికెట్లోనే రెండో అత్యల్ప స్కోరు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 205 పరుగుల తేడాతో గెలవడం విశేషం. మొదట జపాన్‌ 7 వికెట్లకు 217 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో మంగోలియా 8.2 ఓవర్లలో 12 పరుగులకే కుప్పకూలింది. జపాన్‌ ఎడమచేతి వాటం సీమర్‌ కజుమా కటో స్టఫోర్డ్‌ (5/7) మంగోలియా పతనాన్ని శాసించాడు. తుర్‌ సుమయా (4) మంగోలియా టాప్‌ స్కోరర్‌. టీ20 క్రికెట్లో అత్యల్ప స్కోరు రికార్డు ఐజల్‌ ఆఫ్‌ మాన్‌ పేరిట ఉంది. 2023లో స్పెయిన్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు 10 పరుగులకే కుప్పకూలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు