ఓడలో ఫ్రాన్స్‌కు ఒలింపిక్‌ జ్యోతి

1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్‌లో ఒలింపిక్‌ జ్యోతి వెలుగులు నింపింది.

Updated : 09 May 2024 02:37 IST

మార్సె: 1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్‌లో ఒలింపిక్‌ జ్యోతి వెలుగులు నింపింది. బెలెమ్‌గా పిలుస్తున్న ఈ ప్రసిద్ధి గాంచిన ఓడ ఏథెన్స్‌ నుంచి జ్యోతితో ప్రయాణాన్ని మొదలెట్టి.. దక్షిణ ఫ్రెంచ్‌ నగరమైన మార్సెకు బుధవారం చేరుకుంది. జ్యోతి రాకతో ఈ ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్‌ దేశంలో సంబరాలు మిన్నంటాయి. వేలాది పడవల పరేడ్‌ మధ్య బెలెమ్‌.. మార్సె తీరాన్ని చేరుకుంది. ఈ పురాతన ఓడరేవులో అథ్లెటిక్‌ ట్రాక్‌లా కనిపించే వేదిక దగ్గర ఈ బెలెమ్‌ ఆగింది. ఒలింపిక్‌ జ్యోతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలిరావడంతో ఓడరేవు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మార్సెలో గురువారం ఈ జ్యోతి యాత్ర ఆరంభమవుతుంది. ఫ్రాన్స్‌లో జ్యోతిని పట్టుకుని యాత్రలో పాల్గొనే మొట్టమొదటి వ్యక్తిగా ఒలింపిక్‌ స్విమ్మర్‌ ఫ్లోరెంట్‌ మనాడోను ఎంపిక చేశారు. అతను నాలుగు ఒలింపిక్‌ పతకాలు గెలిచాడు. ‘‘ఒలింపిక్స్‌ మా దేశానికి తిరిగి రావడం మాకో అద్భుతమైన సంబరం. ఓ పోటీలను ప్రారంభించడం ఎంత ముఖ్యమో ఓ మాజీ అథ్లెట్‌గా నాకు తెలుసు. అందుకే జ్యోతి రాక కోసం మార్సెను ఎంచుకున్నాం. క్రీడలను ప్రేమించే నగరాల్లో ఇదొకటి’’ అని పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు టోనీ ఎస్తాంగూట్‌ పేర్కొన్నాడు. ఫ్రాన్స్‌ వ్యాప్తంగా యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత పోటీలకు వేదికైన పారిస్‌కు ఈ జ్యోతి చేరుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని