World Cup - NZ vs AFG: కివీస్‌ను ఆదుకున్న లాథమ్‌, గ్లెన్ ఫిలిప్స్.. అఫ్గాన్‌ టార్గెట్ ఎంతంటే?

ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ (NZ vs AFG) తలపడుతున్నాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

Updated : 18 Oct 2023 18:43 IST

చెన్నై: ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ (NZ vs AFG) తలపడుతున్నాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ (54; 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ టామ్ లాథమ్ (68; 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్‌ (71; 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. డేవాన్ కాన్వే (20), రచిన్‌ రవీంద్ర (32) భారీ స్కోర్లు చేయలేకపోయారు. డారిల్ మిచెల్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఒక దశలో 110 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను లాథమ్‌, గ్లెన్ ఫిలిప్స్‌ ఆదుకున్నారు. దీంతో కివీస్ మంచి స్కోరు సాధించగలిగింది.

మొదట్లో లాథమ్‌, ఫిలిప్స్‌ జోడీ నెమ్మదిగా ఆడినా.. ఆఖరి ఓవర్లలో దూకుడు పెంచింది. ఫిలిప్స్‌.. ముజిబుర్‌ వేసిన 42 ఓవర్‌లో ఓ సిక్స్, ఫారూఖీ వేసిన 45 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఒమర్‌జాయ్‌ వేసిన 47 ఓవర్‌లో లాథమ్‌ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ రాబట్టాడు. అయితే, నవీనుల్‌ హక్‌ వీరిద్దరిని 48 ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. ఫిలిప్స్‌ రషీద్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. లాథమ్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చివర్లో మార్క్‌ చాప్‌మన్‌ (25*; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్‌ బౌలర్లలో ఒమర్‌జాయ్‌ 2, నవీనుల్ హక్ 2, ముజిబుర్‌ రెహ్మన్, రషీద్‌ ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.  

రెండు ఓవర్లలో మూడు వికెట్లు.. 

కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డేవాన్ కాన్వేను ముజీబుర్‌ రెహ్మన్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో 30 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత విల్‌ యంగ్, రచిన్ రవీంద్ర నిలకడగా ఆడటంతో 20 ఓవర్లకు 109/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, తర్వాతి రెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పేసర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఒకే ఓవర్‌లో (21 ఓవర్‌) రెండు వికెట్లు పడగొట్టి కివీస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. రచిన్ రవీంద్రను క్లీన్‌బౌల్డ్ చేయగా, విల్‌ యంగ్‌.. వికెట్ కీపర్‌ ఇక్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రషీద్‌ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో డారిల్ మిచెల్‌ మిడ్‌ వికెట్‌లో ఇబ్రహీం జాద్రాన్‌కు చిక్కాడు. ఈ క్రమంలో లాథమ్‌, ఫిలిప్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని