Umran malik: మావాడి విషయంలో తొందరపడటం లేదు: ఉమ్రాన్‌ తండ్రి అబ్దుల్‌ రషీద్‌

తమ కుమారుడు టీ20 ప్రపంచకప్‌ జట్టులో లేకపోవడం తమను ఏమాత్రం బాధించలేదని ఉమ్రాన్‌ మాలిక్‌ తండ్రి అబ్దుల్‌ రషీద్‌ అన్నాడు. 

Published : 28 Nov 2022 01:41 IST

దిల్లీ: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టుకు టీమ్‌ఇండియా యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌  ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఉమ్రాన్‌ తండ్రి అబ్దుల్‌ రషీద్‌ స్పందించాడు. తాము ఈ విషయంలో ఏమాత్రం బాధపడటం లేదన్నాడు. జట్టులో చేరిన స్వల్ప కాలంలోనే ఉమ్రాన్‌ దేశం తరఫున ఆడాలని తాము కోరుకోవడం లేదని తెలిపాడు. 

‘‘ఉమ్రాన్‌ ప్రపంచజట్టులో స్థానం సంపాదించలేకపోయాడంటూ అంతా అంటున్నారు. అతడు ప్రపంచకప్‌ జట్టులో ఆడకపోవడం కూడా ఒకింతకు మంచిదే. అతడి అరంగేట్రానికి ఇంతకన్నా మంచి సందర్భమేదో ఉందని మేం నమ్ముతున్నాం. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. మా కుమారుడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పుడే దేశం తరఫున ఆడాలని తొందరపడటం లేదు.  అతడు సీనియర్లతో డ్రెస్సింగ్‌ రూంను పంచుకుంటున్నాడు. వారి ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటాడు. టీమ్‌ఇండియాలో ఎంతో అనుభవమున్న ఆటగాళ్లు ఉన్నారు. వారు అద్భుతంగా ఆడుతున్నారు. ఇక మిగిలిన వారు సెలక్టర్ల దృష్టిలో పడినప్పుడు అవకాశాలు అవే వస్తాయి’’ అంటూ రషీద్‌ వివరించాడు. 

భారత టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పేరున్న ఈ యువ ఆటగాడు జాతీయ జట్టులో మాత్రం రాణించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో ఉమ్రాన్‌ను తీసుకోవాలని పలువురు సీనియర్లు సూచించారు. అయితే, మహమ్మద్‌ షమీ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని