WPL: బౌండరీల వర్షం కురిపించిన గుజరాత్ ఓపెనర్లు.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

డబ్ల్యూపీఎల్‌ (WPL 2024)లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ భారీ స్కోరు చేసింది. 

Published : 06 Mar 2024 21:10 IST

దిల్లీ: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్ (76; 45 బంతుల్లో 13 ఫోర్లు), బెత్‌ మూనీ (85*; 51 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) బౌండరీలతో విరుచుకుపడటంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.  

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే వోల్వార్డ్ట్, బెత్‌ మూనీ ఎడాపెడా బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఐదు ఓవర్లకే స్కోరు 54/0కి చేరింది. తర్వాత కూడా వీరి దూకుడు కొనసాగింది. పెర్రీ బౌలింగ్‌లో వోల్వార్డ్ట్ వరుసగా మూడు ఫోర్లు బాది అర్ధ శతకం (32 బంతుల్లో) పూర్తి చేసుకుంది. మూనీ కూడా 32 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. కాసేపటికే వోల్వార్డ్ట్ రనౌట్ అయింది. మరోవైపు, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్ (18; 17 బంతుల్లో) సాయంతో బెత్‌ మూనీ జోరు కొనసాగించి గుజరాత్‌కు భారీ స్కోరునందించింది. ఆర్సీబీ బౌలర్లలో సోఫియా, జార్జియా వేర్‌హమ్‌ చెరో వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని