WPL: దీప్తి శర్మ ఒంటరి పోరాటం.. కీలక పోరులో పోరాడి ఓడిన యూపీ

గుజరాత్‌తో జరిగిన కీలక పోరులో యూపీ వారియర్స్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.  

Updated : 11 Mar 2024 23:20 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన కీలక పోరులో యూపీ వారియర్స్‌ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన యూపీ ఆరంభంలో 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వద్ద నాలుగో వికెట్‌, 35 పరుగుల వద్ద మరో వికెట్‌ చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే పూనమ్‌ ఖేర్‌ (36*: 36 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) సహకారంతో బ్యాటింగ్‌ చేసిన దీప్తి శర్మ (88: 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసింది. చావోరేవో అన్న మ్యాచ్‌లో తన జట్టును గెలిపించడానికి శతవిధాల ప్రయత్నించింది. చివరి ఓవర్‌లో విజయానికి 26 పరుగులు అవసరం ఉండగా.. యూపీ 17 పరుగులు చేసి ఓడిపోయింది. గుజరాత్‌ బౌలర్లలో షబ్నమ్‌ షఖిల్‌ మూడు వికెట్లు తీసింది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బెత్‌ మూనీ(74: 52 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌), లారా వోల్వార్ట్‌(43: 43: 30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌) చెలరేగి ఆడారు. వీరు తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టుకు మంచి శుభారంభాన్నిచ్చారు. యూపీ బౌలర్లలో ఎక్లెస్టోన్‌ మూడు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌తో యూపీ తన లీగ్‌ దశను ముగించింది. గుజరాత్‌కు మరో మ్యాచ్‌ మిగిలి ఉంది. ఈ ఓటమితో యూపీ జట్టు లీగ్‌ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే దిల్లీ, ముంబయి జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని