World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్‌ సింగ్

వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు సంజూ శాంసన్‌ (Sanju Samson)ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) వెల్లడించాడు.

Updated : 21 Sep 2023 19:42 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)కు వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో చోటుదక్కలేదు. దీంతో సెలక్టర్లను విమర్శిస్తూ సంజూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) స్పందించాడు. సంజూను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. సంజూ తనకు అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాలని సూచించాడు. 

‘‘సంజూ శాంసన్‌ని జట్టు నుంచి తప్పించడం విస్తృత చర్చకు దారితీసింది. వన్డేల్లో సగటు 55 ఉన్నా ఆ ఆటగాడు ఇప్పటికీ జట్టులో భాగం కాకపోవడం వింతగానే ఉంది. కానీ, భారత జట్టులో ఇప్పటికే ఇద్దరు వికెట్‌ కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్‌ ఉండటంతో సంజూను ఎంపిక చేయలేదని నేను భావిస్తున్నా. ఇలా జరగడం వల్ల నిరుత్సాహపడతారని నాకు తెలుసు. కానీ, సంజూ తన అవకాశం కోసం వేచి చూడాలి. అతను యువకుడు. ఎంతో సమయం ఉంది. ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగాలి. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లలో నేను రాహుల్ వైపు మొగ్గు చూపుతాను. అతను నాలుగు, ఐదు స్థానాల్లో నిలకడగా ఆడుతున్నాడు. శాంసన్ కూడా మంచి ఆటగాడు, సిక్సర్లు కొట్టగలడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక జట్టులో ముగ్గురు వికెట్‌కీపర్‌లను ఉంచలేం. వారందరికీ తుదిజట్టులో చోటు కల్పించడం చాలా కష్టం’’ అని హర్భజన్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమ్‌ఇండియా.. సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. తొలి వన్డే మొహాలీ వేదికగా జరగనుంది.

‘శుభ్‌మన్‌ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్‌లో దంచికొడతాడు’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని