Shubman Gill: డెంగీ తర్వాత నాలుగు కిలోల బరువు తగ్గా..: శుభ్‌మన్‌ గిల్

పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించడానికి చాలా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Gill) వెల్లడించాడు. ప్రపంచకప్‌ టోర్నీకి ముందు డెంగీబారిన పడిన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.

Published : 03 Nov 2023 10:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) శ్రీలంకతో ఓపెనర్‌ రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే ఔటైన తర్వాత మరో బ్యాటర్ విరాట్ కోహ్లీ (88)తో కలిసి శుభ్‌మన్‌ గిల్ (92) భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సెంచరీ సాధిస్తాడని అంతా భావించినా.. కొద్దిలో మిస్‌ చేసుకున్నాడు. తొలుత ముంబయి పిచ్‌పై 350+ స్కోరు చేస్తామని అనుకోలేదని.. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడటం వల్ల సాధ్యమైందని గిల్ వ్యాఖ్యానించాడు. ఇక బౌలర్లూ అద్భుతం చేశారని కొనియాడాడు. డెంగీ నుంచి కోలుకుని వచ్చాక తాను పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేనని.. దాదాపు నాలుగు కేజీల బరువు కూడా తగ్గినట్లు తెలిపాడు.

‘‘మా బౌలర్లు బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. సిరాజ్‌ ఎప్పుడూ ప్రమాదకర బౌలరే. నాణ్యమైన ప్రదర్శన చేస్తుంటాడు. బుమ్రా, షమీ దెబ్బకు మా విజయం నల్లేరు మీద నడకే అయింది. నేనెప్పుడూ వెంటనే కంగారు పడే వ్యక్తిని కాను. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎలా ఆడాలనేది నాకు తెలుసు. ప్రపంచకప్‌లో ఆడేనాటికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ లేదు. డెంగీ వచ్చాక దాదాపు నాలుగు కిలోలు తగ్గా. చక్కగా క్రీజ్‌లో కుదురుకుని ఆడాలనే సూచనలు వచ్చాయి. ఈ పిచ్‌పై బంతి సీమ్‌ కావడంతో మొదట్లో పరుగులు చేయడం కష్టంగా మారింది. దాంతో మొదట్లో ఆచితూచి ఆడాల్సి వచ్చింది. బౌలర్లపై ఒత్తిడి తీసుకు రావాల్సి వచ్చింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి నాకు మంచి ఆరంభమే దక్కింది. కొన్నిసార్లు మంచి షాట్లు కొట్టినా ఫీల్డర్ల వైపు వెళ్తాయి. అందుకే, స్ట్రైక్‌ను రొటేట్‌ చేయడంపై దృష్టిసారించాం. ఈ వికెట్‌ మీద 400 స్కోరు చేయొచ్చని అనిపించలేదు. కానీ, మేం 350+ కొట్టగలిగాం. ఇదంతా శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడటం వల్లే సాధ్యమైంది. అద్భుతంగా ఆడాడు’’ అని గిల్ వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లా అనిపించింది: శ్రేయస్‌

తొలుత తాము బ్యాటింగ్‌ చేసేటప్పుడు పిచ్‌ బాగా సహకరించిందని శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు అనుకూలంగా మారిందని పేర్కొన్నాడు. ‘‘నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్‌పై బౌన్స్‌ అవుతోంది. చక్కగా బ్యాట్‌ మీదకొచ్చింది. ఫస్ట్‌ క్రీజ్‌లో కుదురుకుని తర్వాత భారీ షాట్లు కొట్టాలని భావించా. గిల్- కోహ్లీ రెండో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యం అందించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ గాడిలో పడింది. సింగిల్స్‌, డబుల్స్, బౌండరీలు రాబట్టారు. మంచి పునాది వేశారు’’ అని శ్రేయస్‌ తెలిపాడు. శ్రేయస్‌ 56 బంతుల్లోనే 82  పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 2000కుపైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయ్యర్‌కు ముందు శుభ్‌మన్‌ గిల్ (38 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్ (48 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. అయ్యర్ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. అంతర్జాతీయంగా గిల్ టాప్‌ స్థానంలో ఉండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు