T20 World Cup: ‘లివ్‌ ద గేమ్‌’.. టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్‌

టీ20 ప్రపంచకప్‌ థీమ్‌ సాంగ్‌ను విడుదల చేసిన ఐసీసీ

Published : 24 Sep 2021 01:25 IST

టీ20 మ్యాచ్‌ అంటే బంతిని ఎడాపెడా బాదేయడం. బ్యాటింగ్‌కు వచ్చినప్పటి నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించడం అనే భావన ఉండేది. అయితే ఇప్పుడు బౌలర్లూ తామేం తక్కువ కాదంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుండటంతో బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకుని భారీ షాట్లను కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.  ప్రత్యర్థి జట్టును నిలువరించేందుకు బౌలర్లు విశ్వప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇప్పుడసలే టీ20 కాలం.. ప్రస్తుతం ఐపీఎల్‌ రెండో ఫేజ్‌ ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తోంది. వచ్చే నెల మధ్య వరకు ఐపీఎల్‌ హవా కొనసాగనుంది. ఆ తర్వాత వెంటనే వచ్చేస్తున్నానంటూ అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌ క్రీడాభిమానిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమైపోయింది. భారత్‌ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా 16 జట్లు పాల్గొంటాయి. ఈ క్రమంలో ప్రపంచకప్‌ పోటీలకు సంబంధించి ఐసీసీ ప్రత్యేకగీతాన్ని రూపొందించింది. యానిమేషన్‌ క్యారెక్టర్లతో భారతీయ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది కంపోజ్‌ చేసిన థీమ్‌ సాంగ్‌ వైరల్‌గా మారింది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పొలార్డ్‌, రషీద్ ఖాన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ యానిమేషన్‌ క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ఐసీసీ ప్రత్యేక గీతాన్ని ట్వీట్‌ చేసింది. 

అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ20 ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి. ‘లివ్‌ ద గేమ్‌.. లవ్‌ ద గేమ్’ థీమ్‌తో ప్రపంచంలోని నలుదిక్కుల అభిమానులు ఆటను ఆస్వాదిస్తున్నట్లు వీడియోను ఐసీసీ రూపొందించింది. అమిత్‌ త్రివేది అద్భుతంగా కంపోజ్‌ చేసిన వీడియోలో వరల్డ్‌ కప్‌లో పాల్గొనే జట్ల జెర్సీలను, జాతీయ జెండాలను చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినసొంపైన మ్యూజిక్‌తో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టీ20 ఛాంపియన్‌ విండీస్‌ సారథి పొలార్డ్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అఫ్గానిస్థాన్‌ కీలక ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ‘అవతార్‌’ యానిమేషన్ క్యారెక్టర్లతో గ్రౌండ్‌లోకి దూకుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తారు. టీ20 ప్రపంచకప్‌ కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నట్లు థీమ్‌ సాంగ్‌లో చూపించారు. మరి ఆ థీమ్‌ సాంగ్‌ మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని