Cricket News: పాక్‌లోనూ గిల్‌ను వెతికేశారు.. బాబర్‌కు అక్రమ్‌ సూచన ఇదే.. రిజ్వాన్‌ లేకుండానే..!

Updated : 14 Dec 2023 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  గూగుల్‌ సెర్చ్‌ వివరాలు ఇప్పటికే విడుదలయ్యాయి. పాకిస్థాన్‌లో దిగ్గజాలను కాదని.. ఓ భారత యువ ఆటగాడి గురించే అక్కడి అభిమానులు అధికంగా శోధించారు. పాక్‌ మాజీ కెప్టెన్ బాబర్‌కు అక్రమ్‌ కీలక సూచన చేశాడట.. ఆసీస్‌తో తొలి టెస్టు ఫైనల్‌ XIలో రిజ్వాన్‌కు చోటు దక్కలేదు.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

కోహ్లీ, బాబర్‌ను కాదని.. గిల్‌ కోసం శోధన

పాకిస్థాన్‌లో ‘గూగుల్‌ టాప్‌ ట్రెండింగ్‌ సెర్చ్‌ 2023’లో ఆ జట్టు మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ లేడు. ఇక పాతికేళ్ల గూగుల్ చరిత్రలో అత్యధికంగా శోధించిన క్రికెటర్‌గా (Most Searched Cricketer) విరాట్ కోహ్లీ నిలిచాడు. కానీ, ఈ ఏడాది జాబితాలో మాత్రం శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) 8వ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌లోనూ అతడి కోసం ఎక్కువ మందే వెతికినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాక్‌ క్రికెటర్లు అబ్దుల్లా షఫీక్, సౌద్‌ షకీల్, హసీబుల్లా ఖాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ గురించి కూడా పాక్‌ అభిమానులు ఎక్కువగానే వెతికారు. 


టీ20 లీగుల్లో కెప్టెన్సీ చేపట్టద్దొని బాబర్‌కు చెప్పా: అక్రమ్‌

వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ దారుణమైన ఆటతీరుతో విమర్శలపాలై అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి బాబర్‌ అజామ్‌ (Babar Azam) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీ20లకు షహీన్‌ను, టెస్టులకు షాన్‌ మసూద్‌ను జట్టు యాజమాన్యం సారథులుగా నియమించింది. ఈ క్రమంలో కొత్త బాబర్‌ అజామ్‌ను చూస్తామని భారత మాజీ కెప్టెన్ గంభీర్‌ వ్యాఖ్యానించగా.. దానికి ప్రతిస్పందిస్తూ పాక్‌ దిగ్గజ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్‌ గతంలో బాబర్‌కు తాను ఇచ్చిన సలహాను వెల్లడించాడు. ‘‘తప్పకుండా మనం చూడొచ్చు. రెండేళ్ల కిందటే బాబర్‌ అజామ్‌కు ఓ సూచన చేశా. ‘లీగ్‌ క్రికెట్‌లో ఏ జట్టుకూ కెప్టెన్సీ చేయొద్దని చెప్పా. అతడు స్టార్‌ ప్లేయర్‌. నీకు వచ్చే డబ్బు తీసుకో. నీ ఆట ఆడు. పరుగులు చేయు. హాయిగా విశ్రాంతి తీసుకో. తర్వాత టోర్నీ కోసం సిద్ధంగా ఉండు’ అని సూచించాను. ఎందుకంటే పాక్‌ జట్టుకు కెప్టెన్సీ చేయడం మంచిదే. కానీ, లీగ్‌లో జట్టుకు సారథ్యం వహించడమంటే అదనపు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అక్రమ్‌ తెలిపాడు. 


‘ఇప్పటికైనా పాక్‌ క్రికెట్‌ను అపహాస్యం చేయడం మానేయండి’

ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు పాకిస్థాన్‌ (AUS vs PAK) తుది జట్టులో స్టార్‌ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది కివీస్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన రిజ్వాన్‌ను పక్కన పెట్టడంపై అక్కడి క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పించారు. రిజ్వాన్‌ స్థానంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ను వికెట్‌ కీపర్‌గా పాక్‌ మేనేజ్‌మెంట్ తీసుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) వేదికగా పాక్‌ క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. 

‘‘ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆపేయండి. పాక్‌ క్రికెట్‌ను అపహాస్యం చేయకండి’’ 

‘‘ఇదో చెత్త ఎంపిక. రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్‌ను ఎలా ఎంపిక చేస్తారు? పాకిస్థాన్‌ క్రికెట్ పరువు తీయకండి’’

‘‘ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై రాణించినా రిజ్వాన్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణం’’ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని