Sunil Gavaskar: వచ్చే 10-15 ఏళ్లలో భారత్‌ స్పోర్ట్స్ కంట్రీగా ఎదుగుతుంది: గావస్కర్‌

వచ్చే 10-15 ఏళ్లలో భారతదేశం 'స్పోర్ట్స్ కంట్రీ'గా ఎదుగుతుందని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) పేర్కొన్నాడు. 

Updated : 28 Aug 2023 22:29 IST

ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలంగా భారత ఆటగాళ్లు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సత్తా చాటుతున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోయర్‌ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణ పతకం గెలుచుకోగా..  చెస్ ప్రపంచకప్‌లో యువ సంచలనం ప్రజ్ఞానంద (Praggnanandhaa) రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ కాంస్య పతకం సాధించాడు. ఈ ఆటగాళ్లు సాధించిన విజయాలను భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కొనియడాడు. వచ్చే 10-15 ఏళ్లలో భారతదేశం 'స్పోర్ట్స్ కంట్రీ'గా ఎదుగుతుందన్నాడు.

క్రికెట్‌లోకి రెడ్‌ కార్డ్.. ఈ రూల్‌కు బలైన తొలి క్రికెటర్‌ ఇతడే!

‘‘ఇంతకుముందు కొన్ని క్రీడల గురించి మాత్రమే మాట్లాడటం చూశాం. మీడియా కవరేజీ కూడా వాటికే ఉండేది. ప్రస్తుతం అన్ని క్రీడలకూ ఆదరణ పెరుగుతోంది. ఇతర క్రీడల్లోనూ స్టార్‌ ఆటగాళ్లు పుట్టుకురావడం మనం చూస్తున్నాం. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచినప్పుడు భారత్, ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతున్న విషయం నాకు గుర్తుంది. ఇంగ్లాండ్‌లో ఉండి ఆ ఈవెంట్ చూశా. నీరజ్‌ స్వర్ణం గెలవగానే ఎంతో సంతోషించా. నిన్న  ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు పసిడి పతకం సాధించినప్పుడు కూడా అదే అనుభూతి కలిగింది. గతేడాది ఈ టోర్నీలో రజతం పతకం అందుకున్న నీరజ్‌ ఈసారి మెరుగైన ప్రదర్శన చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్ కాంస్య పతకం సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌ను ఓడించాడు. అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడాదేశాలుగా భావిస్తుంటారు. భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూస్తుంటే వచ్చే 10-15 ఏళ్లలో  భారతదేశాన్ని కూడా ‘స్పోర్ట్స్‌ కంట్రీ’గా పిలుస్తారు’’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని