Red Card: క్రికెట్‌లోకి రెడ్‌ కార్డ్.. ఈ రూల్‌కు బలైన తొలి క్రికెటర్‌ ఇతడే!

వెస్టిండీస్‌ వేదికగా జరుగుతోన్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL)లో ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనకు బలైన తొలి క్రికెటర్‌గా సునీల్‌ నరైన్ (Sunil Narine) చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Published : 28 Aug 2023 17:19 IST

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా హాకీ, ఫుట్‌బాల్, రగ్భీలాంటి క్రీడల్లో ‘రెడ్‌కార్డ్‌’ (Red Card)ను ఉపయోగిస్తారు. ఆటగాళ్లు లేదా కోచ్‌లు శ్రుతిమించి ప్రవర్తించినప్పుడు అంపైర్లు సదరు ప్లేయర్స్‌ లేదా కోచ్‌లకు రెడ్‌కార్డ్‌ను చూపిస్తారు. రెడ్‌కార్డ్‌ను చూపిస్తే సదరు వ్యక్తులు మైదానాన్ని వీడాల్సిందే. కొన్నిసార్లు రెండు, మూడు మ్యాచ్‌ల్లో ఆడకుండా నిషేధం కూడా విధిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ విధానం ఇంకా అందుబాటులో లేదు. కానీ, వెస్టిండీస్‌ వేదికగా జరుగుతోన్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (CPL)లో ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనకు బలైన తొలి క్రికెటర్‌గా సునీల్‌ నరైన్ (Sunil Narine) చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

నాటి లడ్డూనే.. నేటి గోల్డ్‌ ఎహే: బల్లెం వీరుడి కథ తెలుసా..?

ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో నరైన్‌ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్లు వేయనందుకు నరైన్‌ రెడ్‌కార్డ్ రూల్‌తో మైదానం వీడాడు. సీపీఎల్‌లో కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత సమయంలోగా 18 ఓవర్‌ను ప్రారంభించకపోతే ఆ ఓవర్‌లో 30-యార్డ్‌ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. 19 ఓవర్‌ ప్రారంభానికి ముందు కూడా ఓవర్‌ రేట్ తక్కువగా ఉంటే ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్‌ వెలుపల ఉంటారు.

20 ఓవర్‌ ప్రారంభానికి ముందు కూడా ఓవర్‌ తక్కువగా ఉంటే పెనాల్టీ కింద బౌలింగ్ చేసే జట్టు నుంచి ఒక ఫీల్డర్‌ జట్టును వీడాలి. ఏ ఆటగాడిని బయటకు పంపించాలనేది కెప్టెన్‌ ఇష్టం. నిన్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ పొలార్డ్.. నరైన్‌ను మైదానాన్ని వీడాలని కోరడంతో అతడు డగౌట్‌లోకి వెళ్లిపోయాడు.
ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని