IPL 2022 Auction: వేలంలో బాధ్యతగా వ్యవహరించిన ముంబయి ఇండియన్స్‌

ఐపీఎల్‌ మెగా వేలంలో తొలి రోజు ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించిందని బాలీవుడ్‌ స్టార్‌ ప్రీతిజింతా కొనియాడారు...

Updated : 13 Feb 2022 12:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ మెగా వేలంలో తొలి రోజు ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించిందని బాలీవుడ్‌ స్టార్‌ ప్రీతిజింతా కొనియాడారు. బెంగళూరు వేదికగా ఐపీఎల్‌-2022 మెగా వేలం శని, ఆదివారాల్లో ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలిరోజు అన్ని జట్ల మాదిరిగానే వేలంలో పాల్గొన్న ముంబయి ఇండియన్స్‌ సభ్యులు సభలో కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించారు. మరే ఇతర ఫ్రాంఛైజీలు కూడా అలా కనిపించలేదు. దీంతో ఆ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతిజింతా వేలంలో బాధ్యతగా ఉన్నారంటూ ప్రశంసించారు. అలాగే ముంబయి యజమాని నీతా అంబానీ కళ్లు ఆకర్షణీయంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించాని వ్యాఖ్యానించారు.

ఇక ఈ వేలంలో పంజాబ్‌ తొలి రోజు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా ఇంకా రూ.28.65 కోట్ల మొత్తం మిగిలి ఉంది. వేలానికి ముందు మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లను అట్టిపెట్టుకున్న ఆ జట్టు.. శనివారం షారుక్‌ ఖాన్‌ (రూ.9 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), ధావన్‌ (రూ.8.25 కోట్లు), రబాడ (రూ.9.25 కోట్లు) లాంటి కీలక ఆటగాళ్లను సొంతం చేసుకొంది. ఇక మిగిలిన వారిలో జితేశ్‌ శర్మ (రూ.20 లక్షలు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (రూ.3.80 కోట్లు), ఇషాన్‌ పోరెల్‌ (రూ.25 లక్షలు), రాహుల్‌ చాహర్‌ (రూ.5.25 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (రూ.60 లక్షలు) ఉన్నారు. 

మరోవైపు ముంబయి టీమ్‌ తొలిరోజు తమ పాత ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ను అత్యధిక ధర రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. మిగిలినవారిలో బాసిల్‌ థంపి (రూ.30 లక్షలు), మురుగన్‌ అశ్విన్‌ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్‌ బ్రేవిస్‌ (రూ.3 కోట్లు)లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టుతో మిగిలిన మొత్తం రూ.27.85 కోట్లుగా ఉంది. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్‌ పొలార్డ్‌, ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాలను అట్టి పెట్టుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని