Bumrah: బుమ్రా ముంబయి ఇండియన్స్‌ను వీడతాడా? సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేసిన స్టార్‌ పేసర్

ముంబయి ఇండియన్స్‌ను ఆ జట్టు స్టార్‌ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ ఫాలో చేశాడు. దీంతో అతడు ముంబయి జట్టుని వీడతాడని ప్రచారం జరుగుతోంది. 

Updated : 28 Nov 2023 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ప్రధానమైన ఆటగాళ్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఒకడు. అతడు 2013 నుంచి ముంబయి జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ముంబయి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. అందుకే 2022 ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌లతో పాటు జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆ ఫ్రాంఛైజీ రిటైన్‌ చేసుకుంది. అప్పుడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)ను ముంబయి రిటైన్‌ చేసుకోకపోవడంతో అతడిని గుజరాత్ టైటాన్స్‌ తీసుకుని కెప్టెన్‌గా నియమించింది. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌ పాండ్యను పట్టుబట్టి మరి తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. రోహిత్‌ కెరీర్‌ చరమాంకంలో ఉండటంతో హార్దిక్‌ని కెప్టెన్‌గా చేస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇదంతా జరుగుతున్న తరుణంలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి రోహిత్ తర్వాత బుమ్రా కెప్టెన్‌ అవుదామనుకున్నాడు. కానీ, ఇప్పుడు హార్దిక్ పాండ్య తిరిగి రేసులోకి రావడంతో బుమ్రా అసంతృప్తికి లోనయ్యాడని తెలుస్తోంది. అందుకే ముంబయి ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేశాడని నెట్టింట చర్చ జరుగుతోంది. బుమ్రా తన ఇన్‌స్టా స్టోరీలో ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అత్యుత్తమ సమాధానం’’ అనే కొటేషన్‌ పెట్టడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఒకవేళ బుమ్రా ముంబయి ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకుంటే అతడికి వేలంలో భారీ ధర దక్కడం ఖాయం. 2022 సీజన్‌కు ముందు అతడిని ముంబయి రూ.12 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. ఇప్పుడు బుమ్రా వేలంలోకి వస్తే అంతకు రెట్టింపు ధర పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు