Cricket News: స్వదేశంలో జోఫ్రా ఆర్చర్‌ వరల్డ్‌ కప్‌ ఆడటం కష్టమేనా..?

ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే.

Published : 18 Apr 2024 18:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్‌ విండీస్‌ - యూఎస్ఏ వేదికగా జరగనుంది. అయితే, ఇంగ్లాండ్‌ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం పొట్టి కప్‌లో ఆడటం అనుమానమే. తన సొంత దేశం విండీస్‌లో కుటుంబసభ్యుల ఎదుట మ్యాచ్‌ ఆడదామని ఆశ పడిన అతడికి గాయాలు శాపంగా మారాయి. విండీస్‌ నుంచి ఆర్చర్‌ ఇంగ్లాండ్‌కు వలసొచ్చి క్రికెటర్‌గా ఎదిగాడు. గత వన్డే ప్రపంచకప్‌లోనూ అతడిని కేవలం ట్రావెలింగ్‌ రిజర్వ్‌గానే ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే, అతడు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్‌ను పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడించాలని ఈసీబీ భావిస్తోంది. పొట్టి కప్‌ ముందు జరగబోయే ఆ సిరీస్‌ నాటికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు 2021, 2022 ప్రపంచ కప్‌ల సమయంలోనూ మోచేతి గాయం కారణంగా పాల్గొనలేకపోయాడు.


ముందుగానే రిటైర్‌మెంట్ కావడానికి కారణమదే: మెగ్‌ లానింగ్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసీస్‌ మహిళా జట్టును అద్వితీయంగా నడిపించిన సారథి మెగ్‌ లానింగ్‌. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో ఆస్ట్రేలియాకు బంగారు పతకం అందించిన మెగ్‌ లానింగ్‌ ఆ తర్వాత ఆటకు ఆరు నెలలపాటు విరామం ఇచ్చింది. మానసిక ఆరోగ్యం కోసం ఓ కాఫీ షాప్‌లోనూ పని చేసింది. మళ్లీ మైదానంలోకి దిగుతుందని భావించిన వేళ.. సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 31 ఏళ్లే కావడం గమనార్హం. 

‘‘ఆ సమయంలో ప్రతిఒక్కరూ తొందరపడుతున్నావని సూచనలు ఇచ్చారు. నేను మాత్రం క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా లేను. శారీరకంగానూ, మానసికంగా చాలా అలసిపోయా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కో రోజు కేవలం రెండు పూటలు మాత్రమే తిని వారానికి 90 కి.మీ. పరిగెత్తా. అతిగా ఎక్సర్‌సైజ్‌ చేశా. దీంతో అతి తక్కువ రోజుల్లో 64 కేజీల నుంచి 57 కేజీలకు వచ్చేశా. ఆ ప్రభావం ఏంటో ఊహించలేకపోయా. క్రికెట్ ముగిసిన తర్వాత ఏంటి పరిస్థితి? అనే ఆందోళనా ఎక్కువైంది. దీంతో మానసికంగానూ ఇబ్బంది పడ్డా. గతేడాది వరల్డ్‌ కప్, డబ్ల్యూపీఎల్‌ మధ్య చాలా ఒంటరిగా ఫీలయ్యా’’ అని లానింగ్‌ తెలిపింది. సారథిగా మెగ్‌ లానింగ్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీ జట్టును ఫైనల్‌కు చేర్చింది. అక్కడ బెంగళూరు చేతిలో దిల్లీ ఓడిపోయింది.


యూఎస్‌ఏ ప్రధాన కోచ్‌గా ఆసీస్‌ మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ అమెరికా క్రికెట్‌ జట్టు తన ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఆటగాడిని నియమించుకుంది. స్టువర్ట్‌ లా ఆసీస్‌ తరఫున 50కిపైగా మ్యాచ్‌లు ఆడాడు. 1996 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌ జట్టులోనూ సభ్యుడు. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ అండర్ -19 జట్లకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం అతడి సొంతం. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో యూఎస్‌ఏ మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. ఆ సమయానికి జట్టుతోపాటు స్టువర్ట్‌లా చేరతాడు. ఈమేరకు యూఎస్‌ఏ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటన జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని