Kuldeep Yadv: అప్పుడు కుల్‌దీప్‌కు కేకేఆర్‌ ఛాన్స్‌ ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో (WI vs IND) ఏడు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయితే, ఇక్కడ వరకు రావడానికి చాలా శ్రమించాడని అతడి చిన్ననాటి కోచ్‌ కపిల్ పాండే తెలిపారు.

Published : 05 Aug 2023 16:00 IST

ఇంటర్నెట్ డెస్క్: కొన్నాళ్లు బౌలింగ్‌లో లయను కోల్పోయి జాతీయ జట్టులోకి అడుగు పెట్టేందుకు భారత బౌలర్ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) ఇబ్బంది పడ్డాడు. అయితే ఎట్టకేలకు విండీస్‌ పర్యటనకు (WI vs IND) ఎంపికై తన సత్తా ఏంటో చాటాడు. అయితే, మళ్లీ పుంజుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడని కుల్‌దీప్‌ చిన్ననాటి కోచ్‌ కపిల్ పాండే తెలిపారు. ఇలాంటి సమయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌తోపాటు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కేకేఆర్‌ నుంచి సరైన మద్దతు లభించలేదని విమర్శించాడు. మరిన్ని అవకాశాలు ఇవ్వకపోవడంతో తానేంటో నిరూపించుకొనేందుకు కుల్‌దీప్‌ కష్టాలు పడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు.  

వారిద్దరే కాదు.. అతడిలోనూ భవిష్యత్తు స్టార్ లక్షణాలు

‘‘కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టులో ఆడించే అవకాశం ఇవ్వకపోవడం నుంచే కుల్‌దీప్‌ బౌలింగ్‌లో పతనం ప్రారంభమైంది. అయినా, నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నెట్స్‌లో కష్టపడటం కళ్లారా చూశా. కొన్నిసార్లు నేను అతడిని మైదానం నుంచి బయటకు పంపించా. తన బౌలింగ్‌ లెంగ్త్‌, వేగంపై తీవ్రంగా కృషి చేశాడు. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ అవసరాలకు తగ్గట్టుగా మెరుగయ్యాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ లేదా ఐపీఎల్‌లో రాణించాలి. కానీ, ఇంత కష్టపడిన కుల్‌దీప్‌ యాదవ్‌కు మాత్రం ఐపీఎల్‌లోనూ అవకాశాలు రాలేదు. దీంతో ఒకానొక దశలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ‘సర్‌ ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ నాకు తన బాధను వెల్లడించాడు. ఆ సందర్భంగా ‘నిశ్శబ్దంగా ఉండు. క్రికెట్‌ అంటే ఇలానే ఉంటుంది. పదికి తొమ్మిదిసార్లు నీ ఓపికను పరీక్షించడానికే ఇలా జరుగుతుంటుంది’ అని చెప్పా. జాతీయ జట్టులోకి రావాలని బలంగా కోరుకున్నాడు కాబట్టే ఇదొక సవాల్‌గా భావించాడు. మ్యాచ్‌లు ఆడని సమయంలో కూడా ప్రాక్టీస్‌ మీద ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. క్రికెట్‌లో అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తుంటాయి. ఐపీఎల్‌ అనేది  కార్పొరేట్‌ సంస్థలాంటిది. ఇక్కడ ఎవరిని ప్రశ్నించే అధికారం ఉండదు’’ అని కపిల్ పాండే తెలిపారు. 

అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ

జాతీయ జట్టుతోపాటు ఐపీఎల్‌లోనూ అవకాశాలు దక్కకపోవడంతో ఒకానొక  దశలో కుల్‌దీప్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని కొనుగోలు చేసింది. అయితే, మరుసటి సీజన్‌ నాటికి ఫామ్‌ కోల్పోవడంతో తుది జట్టులో మాత్రం ఆడించకుండా అలాగే ఉంచేసింది. నాలుగేళ్లపాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన కుల్‌దీప్‌ను 2022 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఆ సీజన్‌లో 14 మ్యాచుల్లో  21 వికెట్లు తీసిన కుల్‌దీప్‌.. ఇటీవల సీజన్‌లోనూ 14 మ్యాచుల్లో 10 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. దీంతో మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ దొరికింది. ఇలాంటి ప్రదర్శనే కొనసాగితే వచ్చే ఆసియా కప్‌తోపాటు వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని