ODI WC 2023: వరల్డ్‌ కప్‌పై కాళ్లు.. నేనెక్కడా అగౌరవపర్చలేదు: మిచెల్‌ మార్ష్

వన్డే ప్రపంచకప్‌ను (ODI World Cup 2023) నెగ్గాక ఆ ట్రోఫీపై కాళ్లు పెట్టి విమర్శలపాలైన మిచెల్‌ మార్ష్‌ ఎట్టకేలకు ఆ సంఘటనపై స్పందించాడు.

Published : 01 Dec 2023 16:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఫైనల్‌లో టీమ్‌ఇండియాపై (IND vs AUS) విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను (ODI World Cup 2023) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మైదానంలో ఆసీస్‌ ఆటతీరు ఆకట్టుకున్నా.. ఆ జట్టు ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ (Mitchell Marsh) ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారితీసింది. వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇలా ప్రవర్తించడం సరైంది కాదని మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆక్షేపించారు. తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై  దాదాపు రెండు వారాల తర్వాత మిచెల్‌ మార్ష్ స్పందించాడు.

‘‘సోషల్‌ మీడియాలో వస్తున్న ఆ ఫొటోలో ఎలాంటి అమర్యాద ప్రవర్తన కనిపించడం లేదు. దాని గురించి తీవ్రంగా ఆలోచించాలని అనుకోవడం లేదు. అసలు నేను సోషల్‌ మీడియాను ఎక్కువగా చూడను. కానీ, సహచరులు, స్నేహితులు దాని గురించే చెప్పారు. కానీ, నాకు మాత్రం అందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదు’’ అని మార్ష్ వెల్లడించాడు. 

వన్డే ప్రపంచ కప్‌ను సాధించిన ఆనంతరం ఆసీస్‌ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మార్ష్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టాడు. దీంతో మార్ష్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో భారత్‌లో మార్ష్‌పై కేసు కూడా నమోదు కావడం గమనార్హం. ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ గేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఆ ట్రోఫీని అవమానించడంతోపాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచినట్లు కేశవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని