Shami: వందశాతం శ్రమించాం.. ఫైనల్‌లో లోపం ఎక్కడ జరిగిందో చెప్పలేని పరిస్థితి: షమీ

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో (ODI World Cup 2023) భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Published : 28 Dec 2023 12:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా పది మ్యాచుల్లో విజయ దుందుభి మోగించిన టీమ్‌ఇండియా (Team India) వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో తడబాటుకు గురై ఓటమిపాలైంది. ప్రపంచ కప్‌ను (ODI World Cup 2023) కోల్పోవడంతో యావత్‌ భారతావని తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ (PM modi) ప్రత్యేకంగా భారత డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి మరీ ఆటగాళ్లను సముదాయించారు. తాజాగా స్టార్‌ పేసర్ మహమ్మద్ షమీ (Shami) వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ ఈ మెగా సమరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తాము ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామనేది ఇప్పటికీ అర్థం కావడం లేదని పేర్కొన్నాడు.

‘‘దేశమంతా ఈ ఓటమితో తీవ్ర నిరుత్సాహానికి గురైంది. అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. మేం కూడా కప్‌ను సాధిద్దామనే లక్ష్యంతో బరిలోకి దిగాం. వందశాతం శ్రమించి ఫైనల్‌కు చేరాం. అక్కడా విజేతగా నిలవాలని కలలుగన్నాం. కానీ, అంచనాలు తారుమారయ్యాయి. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు’’ అని షమీ తెలిపాడు. 

ఓటమి నిరాశలో ఉన్న మాకు మోదీ ధైర్యం ఇచ్చారు..

‘‘ఆసీస్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి తర్వాత మేం నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాం. సహచరులం కూడా మాట్లాడుకోలేదు. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. తినాలనే ఆసక్తి కూడా లేదు. రెండు నెలలపాటు చేసిన శ్రమ నిష్ఫలం కావడంతో నిరుత్సాహం చెందాం. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చారు. మేమంతా తలెత్తి చూశాం. ఆయన వస్తున్నారనే సమాచారం కూడా మాకు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి దగ్గరకూ వచ్చి ధైర్యం చెప్పారు. ఆయన వెళ్లిన తర్వాతనే మేమంతా ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం ప్రారంభించాం’’ అని షమీ (Shami) చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు