Shubman Gill: నా వందశాతం నైపుణ్యం, వ్యక్తిత్వాన్ని ఇంకా ఎవరూ చూడలేదు: గిల్

భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) క్రీజ్‌లో ఉంటే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తాడు. అయితే, ఇదంతా వందశాతం కాదంటాడు ఈ యువ బ్యాటర్.

Updated : 25 Oct 2023 15:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డెంగీ కారణంగా వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) పాకిస్థాన్‌తో ఆడాడు. అయితే, ఆ మ్యాచ్‌లో 11 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గిల్ (53) హాఫ్ సెంచరీ  సాధించాడు. కివీస్‌పైనా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 71 పరుగుల శుభారంభం అందించాడు. ఈ క్రమంలో 31 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. వచ్చే ఆదివారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న గిల్ తన బ్యాటింగ్‌ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గత ఐపీఎల్‌లో గిల్‌ టాప్‌ స్కోరర్‌ అనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చేసిందంతా 90 శాతమేనని.. ఇంకా వంద శాతం ఎవరూ చూడలేదని వ్యాఖ్యానించాడు. 

‘‘భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా సరే అది 90 శాతం మాత్రమే ప్రదర్శించినట్లవుతుంది. ఇప్పటికీ ఎవరూ నా వందశాతం నైపుణ్యం చూడలేదు. మున్ముందు తప్పకుండా మరింత నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తా. అయితే, ఇది కేవలం భారీ స్కోరు గురించే కాకుండా.. నా ఆటతీరు, వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఏ మ్యాచ్‌లోనైనా సరే మంచి ఇన్నింగ్స్‌ ఆడితే దాని వల్ల జట్టుకు కలిగే ఉపయోగం ఏంటనేది కూడా ఆలోచించాలి. ఆ తర్వాత ఫలితంపై ప్రభావం తప్పకుండా ఉంటుంది’’ అని గిల్ తెలిపాడు. 

ఇదే ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్‌ రికార్డు సృష్టించాడు. మొత్తం 17 మ్యాచుల్లో 890 పరుగులు సాధించాడు. వన్డేల్లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇదే సీజన్‌లో 23 మ్యాచుల్లో 1,325 పరుగులు చేసిన గిల్ అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత నుంచి రెండో బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే 1000+ పరుగులు సాధించాడు. అలాగే వేగంగా 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు 38 వన్డేల్లో 2,012 పరుగులతో గిల్ కొనసాగుతున్నాడు. ఇందులో ఒక డబుల్‌ సెంచరీ కూడా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని