Novak Djokovic : మరోసారి డిటెన్షన్‌ సెంటర్‌కు జకోవిచ్‌

ప్రపంచ టెన్నిస్‌ నంబర్‌ వన్‌ నోవాక్‌ జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతడిని మెల్‌బోర్న్‌లోని డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు...

Published : 15 Jan 2022 09:46 IST

ఇంటర్నెట్ డెస్క్ : ప్రపంచ టెన్నిస్‌ నంబర్‌ వన్‌ నోవాక్‌ జకోవిచ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం మరోసారి మెల్‌బోర్న్‌లోని డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించింది. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోని జకోవిచ్‌ బయట తిరిగితే ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్‌ను డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ విషయంపై జకోవిచ్ మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది!

‘జకోవిచ్‌కు అనుమతిస్తే.. వ్యాక్సిన్ వ్యతిరేక భావన పెరిగిపోతుంది. అది దేశ పౌరుల్లో అనిశ్చితికి దారి తీస్తుంది’ అని ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ అలెక్స్‌ హాకే పేర్కొన్నారు. విచారణ కోసం ఆదివారం జకోవిచ్‌ ఫెడరల్‌ కోర్టు ముందు డిటెన్షన్‌ సెంటర్‌ నుంచే కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు కావాలని సూచించారు.

జకోవిచ్‌ను డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించడంపై సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ ఉసిక్‌ స్పందించారు. ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారుడిని ఆస్ట్రేలియా ప్రభుత్వం అవమానించిందని విమర్శించారు. ‘ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పదో ట్రోఫీ గెలవకుండా జకోవిచ్‌పై నిషేధం విధించాలనుకుంటే.. అతడిని వెనక్కి ఎందుకు పంపలేదు. వీసాను పునరుద్ధరించడం సాధ్యం కాదని ఎందుకు చెప్పలేదు? నోవాక్‌.. మీకు అండగా మేమున్నాం!’ అని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు లాక్‌డౌన్‌లో గడిపారు. ప్రభుత్వం వారిని కాపాడుతుందని విశ్వసించారు. ప్రస్తుతం జకోవిచ్‌ను అనుమతించి వారి నమ్మకాన్ని వమ్ము చేయలేం’ అని మారిసన్‌ వివరించారు.

ప్రస్తుతం జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో.. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో సమానంగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొని 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి చరిత్ర సృష్టించాలన్న జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి నిరాశే ఎదురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని