IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. కళ్లన్నీ వారిపైనే.. ఫైనల్ XI ఎలా ఉండనుందో?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను ఆడేందుకు భారత్‌ (IND vs AUS) రంగంలోకి దిగనుంది. మొహాలీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. కీలకమైన ఆటగాళ్లు లేకుండానే టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. 

Updated : 21 Sep 2023 19:32 IST

మెగా సమరం ముంగిట చివరి వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమైంది. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్‌ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న ఆస్ట్రేలియాతో (IND vs AUS) తలపడనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో మొదటి రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్‌ నాయకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ 22న (శుక్రవారం) మొహాలీ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. అయితే, కొందరు ఆటగాళ్ల విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ తుది అంచనాకు రావడానికి ఈ సిరీస్‌ అత్యంత కీలకం. 

రెండు స్థానాలు.. ముగ్గురు పోటీ

వరుస షెడ్యూల్‌ కారణంగా తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌లకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. మూడో వన్డే నాటికి సీనియర్లంతా వచ్చేస్తారు. ఇప్పటికే ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28 వరకు వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో ఐసీసీ అనుమతి మేరకు మార్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది. అయితే, ఈ సిరీస్‌లో ప్రతిభ ఆధారంగా వన్డే ప్రపంచకప్ తుది స్క్వాడ్‌లో అవకాశం లభించే అవకాశాలు ఉంటాయి. తుది జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న వారి జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు. ఆసీస్‌తో సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నా.. ఫైనల్‌ XI ఆడటం అనుమానంగానే ఉంది. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అక్షర్ పటేల్‌ గాయపడిన సంగతి తెలిసిందే. అతడిని ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు ఎంపిక చేయలేదు. మూడో మ్యాచ్‌కు (సెప్టెంబర్ 27న) కూడా ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే అక్షర్ ఉంటాడు. లేకపోతే వరల్డ్‌ కప్‌కు దాదాపు దూరమైనట్లే.  

వీరి ఆటపైనే దృష్టి..!

దాదాపు సంవత్సరం తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ వన్డే జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌ అంచనాల్లో లేని అశ్విన్‌ను ఇప్పుడు ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయడం గమనార్హం. అక్షర్ పటేల్ స్థానంలో వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లోకి వచ్చేందుకు ఛాన్స్‌ ఉంది. కానీ, దానికి యువ స్పిన్‌ ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌తో పోటీ పడాల్సిందే. బౌలింగ్, బ్యాటింగ్‌పరంగా చూస్తే సుందర్‌ కంటే అశ్విన్‌ బెటర్. కానీ, మైదానంలో చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాలి. ఇక హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్‌ వర్మకూ మొన్నటి వరకు వరల్డ్‌ కప్‌ తలుపులు మూసుకుపోయాయని అనుకున్నారంతా. కానీ, శ్రేయస్ పరిస్థితి అయోమయంగా మారడంతో తిలక్‌కూ ఓ ఛాన్స్‌ దొరికినట్లైంది. ఇప్పుడీ సిరీస్‌లో శ్రేయస్‌ ఆడలేకపోయి..  తిలక్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కి ఉత్తమ ప్రదర్శన చేస్తేనే వరల్డ్‌ కప్‌లో ఆడటం దాదాపు ఖాయమవుతుంది.

ఆసీస్‌తో పోరులో ఎవరికి అవకాశం!

ఆసీస్‌తో తొలి వన్డేలో తుది జట్టుకు ఎవరిని ఆడించాలనేదే ఇప్పుడు భారత్‌ ముందున్న అతిపెద్ద సవాల్. ఆసియా గేమ్స్‌లో భారత్‌ జట్టుకు నాయకత్వం వహించనున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేసింది. పదకొండు మందిలో ఆడించకపోయినా.. జట్టుతోపాటు ఉండటం వల్ల ఆసియా గేమ్స్‌లో ఆ అనుభవం రుతురాజ్‌కు ఉపయోగపడుతుందనేది మేనేజ్‌మెంట్ అభిప్రాయం. రోహిత్‌ లేకపోవడంతో గిల్‌తో కలిసి ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వచ్చే అవకాశాలున్నాయి. వన్‌డౌన్‌లో కేఎల్ రాహుల్‌ వచ్చినా.. నాలుగో స్థానంలో శ్రేయస్‌ లేదా తిలక్‌ వర్మ ఆడతారు. సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎలానూ ఐదో స్థానమే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జడేజా, సుందర్‌, అశ్విన్‌ ఉంటారు. బుమ్రా, సిరాజ్‌, షమీతోనే పేస్‌ బౌలింగ్‌ను వేయించే అవకాశాలు ఎక్కువ. అదనంగా బ్యాటర్‌ కావాలనుకుంటే ఆ ముగ్గురిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి శార్దూల్‌ను తీసుకొనే వెసులుబాటు ఉంది. 

మ్యాచ్‌ షెడ్యూల్‌ ఇలా.. 

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా శుక్రవారం తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ను అరగంట ముందుగా వేస్తారు. ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా ఓటీటీతోపాటు స్పోర్ట్స్‌ 18 ఛానల్స్‌లో వీక్షించే అవకాశం ఉంది. 

తుది జట్టు (అంచనా): 

భారత్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, శ్రేయస్/తిలక్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని