Cricket Trolling: ఈ అంపైర్‌.. స్టీవ్‌ బక్నర్ 2.0.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌

సోషల్‌ మీడియాలో ఏమాత్రం అవకాశం వచ్చిన ట్రోలింగ్‌కు గురి చేసేందుకు నెటిజన్లు సిద్ధంగా ఉంటారు. ఇటీవల క్రికెట్‌లో అయితే మరీ  ఎక్కువగా జరుగుతున్నాయి.

Published : 06 Mar 2023 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌లో (Cricket) గమ్మత్తైన చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులు.. ఇలా వారు చేసే విన్యాసాలు సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా అంపైర్లు వెలువరించే నిర్ణయాలు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. తమకు అనుకూలంగా లేకపోతే విమర్శలు చేస్తుంటారు. తాజాగా టీమ్‌ఇండియా టాప్ అంపైర్ నితిన్ మీనన్ కూడా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మాత్రం అభిమానులకు నవ్వులు తెప్పిస్తుండగా.. మైదానంలోని ఆటగాళ్లను షాక్‌కు గురి చేసింది. అయితే, ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.

స్నేహపూర్వక మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. బౌలర్‌ అద్భుతమైన బంతిని సంధించగా.. సదరు బ్యాటర్‌ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి తన ప్యాట్లకు తాకి పైకి లేవడంతో కీపర్‌ ఒడిసిపట్టుకున్నాడు. దీంతో బౌలర్, కీపర్‌ పెద్దగా అప్పీలు చేశారు. అయితే, అంపైర్‌ మాత్రం ఏమాత్రం స్పందించలేదు. సరేలే.. మళ్లీ బౌలింగ్‌ వేద్దామని బౌలర్ సిద్ధమవుతుండగా.. ఒక్కసారి అంపైర్‌ చేతి వేలిని పైకి ఎత్తేశాడు. దీంతో బౌలర్ ఆశ్చర్యపోగా.. బ్యాటర్‌ మాత్రం ఇదేం నిర్ణయమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నెటిజన్లు మాత్రం ట్రోలింగ్‌ (Trolling) చేసేశారు. 

‘‘స్టీవ్‌బక్నర్‌ 2.0.. హాలిడే ప్రకటించిన తర్వాత విధులకు వచ్చాడు’’

‘‘అంపైర్‌ ఇంకా.. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మోడ్‌లోనే ఉన్నట్లు ఉన్నాడు’’

‘‘వికెట్‌ కీపర్‌ నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అయి ఉంటాడు’’

‘‘డ్యూడ్‌.. కాస్త చిన్నగా ఆడండి.. అతడి బుర్రలో రిప్లే అవుతుంది’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని