పైన్‌కు ‘పెయిన్‌’ తప్పదని సన్నీ హెచ్చరిక

ఆస్ట్రేలియా సారథిగా టిమ్‌పైన్‌కు రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ను అతడు స్లెడ్జింగ్‌ చేసిన విధానం అసహ్యంగా ఉందని విమర్శించాడు. నాయకుడిగా అతడి ప్రవర్తన అయోగ్యంగా ఉందని స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యాష్‌...

Published : 11 Jan 2021 22:55 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా సారథిగా టిమ్‌పైన్‌కు రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ను అతడు స్లెడ్జింగ్‌ చేసిన విధానం అసహ్యంగా ఉందని విమర్శించాడు. నాయకుడిగా అతడి ప్రవర్తన అయోగ్యంగా ఉందని స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యాష్‌, విహారి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు అతడు బూతు పదాలు మాట్లాడిన సంగతి తెలిసిందే.

‘నేనైతే ఆస్ట్రేలియా సెలక్టర్‌ను కాదు. కానీ కెప్టెన్‌గా పైన్‌ రోజులు దగ్గరపడ్డాయి. భీకరమైన ఆసీస్‌ బౌలింగ్‌లో వికెట్లు తీయకుండా టీమ్‌ఇండియా 130 ఓవర్లు ఆడేలా చేశాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఇవేవీ చేయకుండా అతడు బ్యాట్స్‌మెన్‌తో మాట్లాడేందుకే ఆసక్తి ప్రదర్శించాడు. అందుకే ఈ సిరీసు ముగిశాక కెప్టెన్‌పై వేటు పడితే ఆశ్చర్యమేమీ లేదు’ అని సన్నీ అన్నాడు. కీపింగ్‌లోనూ సులభమైన క్యాచులు వదిలేశాడని విమర్శించాడు.

‘రవిచంద్రన్‌ అశ్విన్‌తో మాట్లాడాక పైన్‌ ఏకాగ్రత కోల్పోయాడు. మొదట అతడు క్రికెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడాడు. ప్రత్యర్థితో మాట్లాడేటప్పుడు ఆట గురించే అనాలి. బ్యాట్స్‌మెన్‌కు ఎలా ఆడాలో తెలియదని, బాగా ఆడరాదని అనొచ్చు. కానీ అశ్లీల పదజాలాన్ని మాత్రం అస్సలు అంగీకరించలేం. అది మీరు చికాకులో ఉన్నట్టు చూపిస్తుంది. ప్రత్యర్థి పోరాటాన్ని సహించలేకపోతున్నారని ఎత్తిచూపుతుంది. కెప్టెన్‌గా ఆటపై శ్రద్ధ పెట్టాలి కానీ ఇలాంటి వాటిపై కాదు’ అని సన్నీ స్పష్టం చేశాడు.

ఇవీ చదవండి
‘ఛీటర్‌ స్మిత్‌’! ఇంకా మారలేదా?
‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని