Hardik Pandya: ప్రపంచకప్‌ వచ్చేస్తోంది.. పాండ్య ఫామ్‌ను అందిపుచ్చుకోవాలి: పార్థివ్

స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ కంటే ముందే హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఫామ్‌లోకి రావాల్సిన అవసరముందని పార్థివ్‌ పటేల్ (Parthiv Patel) పేర్కొన్నాడు. 

Published : 17 Aug 2023 13:25 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కొంతకాలగా నిలకడగా రాణించట్లేదు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 82 పరుగులు చేసిన అతడు.. అదే జట్టుతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో 77 పరుగులే చేశాడు. త్వరలో ఆసియా కప్‌, అనంతరం వన్డే ప్రపంచకప్‌ ఉండటంతో అతడి ఫామ్‌పై భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్ (Parthiv Patel) ఆందోళన వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా పాండ్య ఇంకా నేర్చుకుంటున్నాడని, స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ కంటే ముందు అతడు ఫామ్‌లోకి రావాల్సిన అవసరముందన్నాడు. ‘‘హార్దిక్‌ బ్యాటింగ్ కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అతడు పరుగులు సాధించాలి. ఐపీఎల్‌లో రన్స్‌ చేయలేదు. గత కొన్ని సిరీస్‌ల్లో కూడా రాణించలేదు. వన్డే ప్రపంచకప్‌ కంటే ముందు జరిగే ఆసియా కప్‌, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో అతడు ఫామ్‌ను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.

‘విరాట్‌ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే భారత్‌ ఈ స్థితిలో ఉండేది కాదు’


పాండ్య దూకుడుగా ఆడట్లేదు: ఆకాశ్‌ చోప్రా 

హార్దిక్ ఫామ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. పాండ్య గత కొంతకాలంగా దూకుడుగా ఆడట్లేదని విమర్శించాడు. “ గతేడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది వరకు పాండ్య 25 మ్యాచ్‌లు ఆడాడు. నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన వారి స్ట్రైక్‌రేట్‌ని పరిశీలిస్తే.. పాండ్య కింది నుంచి మూడో స్థానంలో ఉన్నాడు. అతడు భారీ హిట్టింగ్‌ చేయడం లేదు. ఇటీవల అతడి అంతర్జాతీయ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత పది టీ20ల్లో పాండ్య తాను ఎదుర్కొన్న బంతుల కంటే ఎక్కువ పరుగులు చేసింది కేవలం రెండు, మూడుసార్లే’’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు. హార్దిక్ పాండ్య నాయకత్వంలో ఇటీవల వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పుంజుకున్నట్లే కనిపించినా.. చివరి మ్యాచ్‌లో చేతులెత్తేసి సిరీస్‌ను కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని