
Racism: మైకెల్ వాన్‌పై ‘జాత్యహంకార’ ఆరోపణలు.. బీబీసీ షో నుంచి తొలగింపు
ఇంటర్నెట్ డెస్క్: తన వెటకారపు కామెంట్లతో టీమ్‌ఇండియా క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ‘జాత్యహంకార’ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ‘రేసిజం’కు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు, సంఘీభావాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ మ్యాచుల సందర్భంగానూ అన్ని జట్లు క్రీడాకారులు జాత్యహంకారానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ‘రేసిజం’ సెగ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్‌ను తాకింది. మైకెల్ వాన్ తమపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు అజీమ్ రఫీక్ సహా మరొక ఆటగాడు ఆరోపించారు. దీంతో తమ షో నుంచి వాన్‌ను తొలగించినట్లు, సంఘటనపై విచారణకు ఆదేశించామని బీబీసీ వెల్లడించింది. బీబీసీలో విశ్లేషకుడిగా మైకెల్ వాన్ టెస్ట్ మ్యాచ్ స్సెషల్ ‘ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో’ని 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. అయితే అజీమ్ రఫీక్ చేసిన ‘రేసిజం’ ఆరోపణలతో గత సోమవారం షోలో మైకెల్ వాన్ కనిపించలేదు. 2009లో నాటింగ్‌హామ్‌షైర్, యార్క్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతోపాటు మరొక ఆటగాడిపై మైకెల్ వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు రఫీక్ ఆరోపించాడు. జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించి రఫీక్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును సిద్ధమేనని మైకెల్ వాన్ ప్రకటించాడు. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ఆరోపణలను తిరస్కరించాడు.
ఇంగ్లాండ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మైకెల్ వాన్ 1991 నుంచి 2009లో రిటైర్‌మెంట్ వరకు యార్క్‌షైర్ కౌంటీకీ ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం విశ్లేషకుడిగా మారిపోయాడు. భారత్‌కు సంబంధించిన గెలుపోటములపై తనదైన వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఉంటాడు. 2009లో నాటింగ్‌హామ్‌షైర్, యార్క్‌షైర్ మ్యాచ్‌ను విశ్లేషిస్తూ.. ‘‘మీరు (ఆసియా క్రీడాకారులు) చాలా మంది ఉన్నారు.. మేం దాని గురించి ఏదైనా చేయాలి’’ అంటూ మైకెల్ వాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రఫీక్ ఆరోపించాడు. ప్రొఫెషనల్‌గా రఫీక్‌కు అదే తొలి ఏడాది కావడం గమనార్హం. అయితే వాటిపై మైకెల్ వాన్ స్పందిస్తూ.. ‘‘అలాంటి పదాలు వాడినట్లు వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నా. దాచిపెట్టేందుకు ఏమీ లేదు. ‘మీరు చాలామంది’అని వ్యాఖ్యానించడం మాత్రం ఎప్పటికీ జరగదు’’ అని స్పష్టం చేశాడు. ఆ పదాలను తాను వాడలేదని మాత్రం గట్టిగా నమ్ముతున్నానని మైకెల్ వాన్ చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.