Ranji Trophy Final: రంజీ ట్రోఫీ ఫైనల్‌.. అదరగొట్టిన శార్దూల్.. తొలి రోజు ముంబయిదే జోరు

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబయి, విదర్భ తలపడుతున్నాయి. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 31/3 స్కోరుతో నిలిచింది.

Published : 10 Mar 2024 17:34 IST

ముంబయి: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో 41సార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి.. రెండుసార్లు విజేతగా నిలిచిన విదర్భ తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వానీ (37) రాణించారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శార్దూల్ ఠాకూర్‌ (75; 69 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్‌ 3, హర్ష్‌ దూబే 3, ఉమేశ్ యాదవ్‌ 2, ఆదిత్య థాక్రే ఒక వికెట్ పడగొట్టారు. 

అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విదర్భ తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 31/3 స్కోరుతో నిలిచింది. అథర్వ తైడే (21), ఆదిత్య థాక్రే (0) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. వన్‌డౌన్ బ్యాటర్‌ ధ్రువ్‌ షోరె (0)ని శార్దూల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అమన్‌ (8), కరుణ్‌ నాయర్‌ (0)లను ధవళ్‌ కులకర్ణి వెనక్కి పంపాడు. 

అనుహ్యంగా ఆరు వికెట్లు..  

ఓపెనర్లు పృథ్వీ షా, భూపేన్‌ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబయి భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, అనుహ్యంగా వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముషీర్‌ ఖాన్‌ (6), కెప్టెన్‌ అజింక్య రహానె (7), శ్రేయస్ అయ్యర్‌ (7), హార్దిక్ టామోర్ (13) వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. 111 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబయిని శార్దూల్ ఠాకూర్‌ ఆదుకున్నాడు.  దూకుడుగా ఆడిన శార్దూల్‌ను ఉమేశ్ యాదవ్‌ ఔట్‌ చేయడంతో ముంబయి ఆలౌటైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని