IPL 2024 Auction: ఈ సంప్రదాయం మంచిది కాదు.. ఓవర్సీస్‌ ప్లేయర్ల ఏజెంట్స్‌ తెలివైనోళ్లు: డీకే

ఐపీఎల్ మినీ వేలంలో రూ. 24.75 కోట్లు వెచ్చించి మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా.. రూ.20.5 కోట్లు పెట్టి ప్యాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Updated : 21 Dec 2023 11:47 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL) మినీ వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్‌ రూ. 24.75 కోట్లు, ప్యాట్ కమిన్స్ రూ.20.5 కోట్లు దక్కించుకుని సంచలనం సృష్టించారు. వేలంలోనే కాకుండా.. మొత్తంగా ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా రికార్డు నమోదు చేశారు. వారికి ఈ స్థాయి ధర దక్కడంపై టీమ్‌ఇండియా వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ కాస్త విభిన్నంగా స్పందించాడు. ఇలాంటి భారీ మొత్తాలను సాధించేందుకు ఓవర్సీస్‌ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తెలివిగా వ్యవహరించారని వ్యాఖ్యానించాడు. వేలంలోని లొసుగులను వినియోగించుకుని ఇంత పెద్ద మొత్తం సొంతం చేసుకున్నారని, ఇలాంటి ట్రెండ్‌ ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నాడు. 

‘‘నేరుగా మినీ వేలానికి వచ్చే ఆటగాళ్లకు నేను పెద్ద ఫ్యాన్‌ను కాదు. వేలంలోని లొసుగులను పట్టుకుని విదేశీ ఆటగాళ్లు, వారి ఏజెంట్లు తమ తెలివితేటలను చక్కగా వాడారు. మెగా వేలంలోకి కాకుండా.. మినీ వేలంలోకి తీసుకొచ్చి భారీ ధర దక్కేలా చేయడంలో విజయవంతమయ్యారు. అయితే, ఇలాంటి ట్రెండ్‌ ఆరోగ్యకరమైన పోటీని దూరం చేస్తుంది. అందుకే, బీసీసీఐ ఇలాంటి సమస్యను అదుపు చేయగలదని భావిస్తున్నా. దాని కోసం నేను రెండు పరిష్కారాలను కూడా చెబుతున్నా’’ అని పోస్టు చేశాడు. 

ఇది చక్కటి ఉదాహరణ.. 

‘‘మినీ వేలంలోకి వచ్చిన విదేశీ ఆటగాళ్లలో చాలా మందికి భారీ ధర దక్కింది. ఇలా చేయడం వల్ల భారత స్టార్‌ పేసర్లు తక్కువ మొత్తంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు జస్‌ప్రీత్‌ బుమ్రాను తీసుకుంటే.. అతడి ధర రూ. 11 కోట్లు. కానీ, మినీ వేలంలోకి వచ్చిన కొందరికి అతడి కంటే అధిక ధర దక్కింది. గతేడాది కామెరూన్‌ గ్రీన్, సామ్‌ కరన్‌ రికార్డు ధరలను పొందారు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ అదే దారిలో పయనించారు. ఇందులో వీరి పొరపాటేమీ లేదు. వారి ఏజెంట్లు కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలం కంటే ముందు ఈ మినీ వేలంలోకి తీసుకొచ్చారు. దీంతో ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న సొమ్ము నుంచి ఎక్కువ మొత్తం వెచ్చించాయి’’ అని డీకే చెప్పాడు.

పరిష్కారాలు ఇవిగో..

‘‘భారీ ధర ట్రెండింగ్‌ను అదుపులో ఉంచేందుకు రెండు పరిష్కారాలు. అందులో ఒకటి.. ఎవరైనా సరే మినీ వేలంలోకి రావాలనుకుంటే.. అంతకుముందు మెగా వేలంలో అతడు దక్కించుకున్న సొమ్మునే గరిష్ఠ పరిమితిగా పెట్టాలి. అప్పుడు సదరు ఫ్రాంచైజీ అతడిని కొనసాగించే అవకాశం ఉంటుంది. లేకపోయినా ఇలాంటి అనూహ్యమైన ధరలు సొంతం చేసుకునే అవకాశం ఉండదు. ఇక రెండోది.. మెగా వేలంలో భాగం కాకుండా.. మినీ వేలంలోకి వచ్చిన ఆటగాడు భారీ ధరను దక్కించుకున్నాడనుకుందాం. అప్పుడు ఆ జట్టులోని ఖరీదైన ఆటగాడికి ఎంత సొమ్ము చెల్లిస్తామో.. అంతే మొత్తం సదరు మినీ వేలం ద్వారా వచ్చిన ఆటగాడికి ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ మిగతా మొత్తాన్ని బీసీసీఐకి ఇచ్చేయాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని దినేశ్‌ కార్తిక్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని