IND vs SL: భారత్‌ చేతిలో శ్రీలంక చిత్తు.. నమోదైన రికార్డులు ఇవే..!

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) వరుసగా ఏడు విజయాలు సాధించిన భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా శ్రీలంకను చిత్తు చేసి రికార్డు విజయం నమోదు చేసింది.

Updated : 03 Nov 2023 14:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకను భారత్ 302 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకాలు సాధించారు. దీంతో టీమ్‌ఇండియా 357/8 స్కోరు చేసింది. బౌలింగ్‌లో షమీ 5, సిరాజ్ 3.. బుమ్రా, జడేజా చెరో వికెట్‌ తీయడంతో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది. భారీ తేడాతో విజయం సాధించడమే రికార్డు కాగా.. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

  1. వన్డేల్లో అత్యధికంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత బౌలర్‌ షమీ. అతడు ఇప్పటి వరకు నాలుగుసార్లు సాధించాడు. అతడి తర్వాత జవగళ్‌ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌ మూడేసి సార్లు సాధించారు. 
  2. ఒకే వరల్డ్‌ కప్‌లో అత్యధికసార్లు నాలుగు వికెట్లు తీయడం ఇది షమీకి మూడోసారి. 2019 ఎడిషన్‌లోనూ మూడుసార్లు 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఓవరాల్‌గా షాహిద్‌ అఫ్రిది 2011లో నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు.
  3. ఇక వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా షమీనే. అతడు మూడుసార్లు  ఈ ఘనత సాధించాడు. ఆసీస్‌ పేసర్ మిచెల్ స్టార్క్‌ కూడా 3 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
  4. వన్డే చరిత్రలో వరుసగా మూడుసార్లు 4 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా షమీ అవతరించాడు. అలాగే రెండుసార్లు ఇలాంటి ప్రదర్శన చేయడం కూడా విశేషం. 2019 వరల్డ్‌ కప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో షమీ (4/40, 4/16, 5/69) ఈ ఘనత సాధించాడు. పాక్‌ దిగ్గజం వకార్‌ యూనిస్‌ మాత్రమే మూడుసార్లు (1990లో రెండుసార్లు, 1994లో ఒకసారి) సాధించడం విశేషం.
  5. వన్డేల్లో అత్యంత భారీ తేడాతో గెలిచిన నాలుగో మ్యాచ్‌ ఇదే. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకపైనే భారత్‌ 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వరల్డ్‌ కప్‌ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం. ఇదే వరల్డ్‌ కప్‌లో నెదర్లాండ్స్‌పై ఆసీస్ 309 పరుగుల తేడాతో గెలిచింది. 
  6. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐసీసీ సభ్య దేశాల్లో శ్రీలంక ఒకటి. ఇప్పుడు శ్రీలంక 55 పరుగులే చేసింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు బంగ్లాదేశ్‌పై ఉండేది. 2011 వరల్డ్‌ కప్‌లో విండీస్‌పై 58 పరుగులే చేయగలిగింది. 
  7. వన్డేల్లో భారత్‌పై అత్యల్ప స్కోరు నమోదు చేయడం శ్రీలంకకు ఇది రెండోసారి. కొలంబో వేదికగా 50 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 55 పరుగులకే ఆలౌటైంది.
  8. వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడం ఇది ఎనిమిదోసారి. శ్రీలంకకు రెండోసారి కావడం గమనార్హం. 2003 వరల్డ్‌ కప్‌లోనూ భారత్‌పైనే శ్రీలంక ఐదుగురు బ్యాటర్లు సున్నాకే ఔటయ్యారు.
  9. ఒక్క బ్యాటర్‌ సెంచరీ చేయకుండా అత్యధిక స్కోరు (357/8) నమోదు చేసిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. ముగ్గురు ఆటగాళ్లు భారీ అర్ధశతకాలు (గిల్ -92, విరాట్ -88, శ్రేయస్ -82) సాధించారు. అంతకుముందు ఇంగ్లాండ్‌పై పాక్‌ (2019లో) 348/8 స్కోరు చేసింది.
  10. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఐదో మ్యాచ్‌ ఇది. శ్రీలంకపై టీమ్‌ఇండియా బ్యాటర్లు 9 సిక్సర్లు బాదారు. వ్యక్తిగతంగా శ్రేయస్‌ అయ్యర్ ఒక్కడే ఈ మ్యాచ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఇలా ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఐదో బ్యాటర్‌గా అయ్యర్ నిలిచాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు