IPL 2021: కృనాల్‌ పాండ్య క్రీడాస్ఫూర్తి.. బతికిపోయిన కేఎల్‌ రాహుల్‌.!

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మలి దశలో భాగంగా.. అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచులో చోటు చేసుకున్న ఓ ఘటన క్రీడాస్ఫూర్తిని చాటింది. అసలు ఏం...

Published : 30 Sep 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్కు: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మలి దశలో భాగంగా.. అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచులో చోటు చేసుకున్న ఓ ఘటన క్రీడాస్ఫూర్తిని చాటింది. అసలు ఏం జరిగిందంటే.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి జట్టు.. పంజాబ్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కృనాల్ పాండ్య వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతిని పంజాబ్ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌ స్ట్రెయిట్‌ షాట్ ఆడాడు. అది కృనాల్‌ చేతిని తాకి నేరుగా వికెట్లకు తగిలింది. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ పరుగు తీసేందుకు అప్పటికే క్రీజు దాటి ముందుకు వచ్చాడు. దాంతో కృనాల్ పాండ్య రనౌట్‌కి అప్పీల్‌ చేశాడు. అయితే, ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూచన మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని క్రీడాస్ఫూర్తిని చాటాడు. దీంతో ముంబయి ఇండియన్స్ జట్టుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచులో ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 136 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ముందుంచింది. అనంతరం, బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్‌ మలిదశలో ముంబయి బోణీ కొట్టింది. ముంబయి బ్యాటర్లలో సౌరభ్‌ తివారీ (45), హర్దిక్‌ పాండ్య (40) రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని