Rohit Sharma: కెప్టెన్‌ కోరుకునేది ఇదే కదా.. రోహిత్ డ్రెస్సింగ్‌ రూమ్‌ స్పీచ్‌ వైరల్

దిల్లీపై విజయం సాధించిన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ముంబయి బ్యాటర్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) జట్టు సభ్యులనుద్దేశించి ప్రసంగించాడు. 

Published : 08 Apr 2024 18:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్‌ బేస్‌, బలమైన జట్లలో ముంబయి ఒకటి. ఐపీఎల్‌ 17 సీజన్‌లోనూ ఆ జట్టు పటిష్టంగానే ఉంది. కానీ, మూడు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత గెలుపు రుచి చూసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) (49), ఇషాన్‌ కిషన్ (42) దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించిన ముంబయి.. టిమ్‌ డేవిడ్‌ (45), షెఫర్డ్‌ (39) మెరుపులతో 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో దిల్లీ 205/8కి పరిమితమైంది.

ఈ సీజన్‌ నుంచి ముంబయి కొత్త సంప్రదాయానికి తెరతీసింది. మ్యాచ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లకు స్పెషల్ అవార్డ్స్‌ అందిస్తోంది. ఈ క్రమంలో దిల్లీతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో రోహిత్‌శర్మకు మెడల్‌ను అందించారు. దిల్లీపై సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టినందుకు రోహిత్‌కు మెడల్‌ అందించాలని ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ అనౌన్స్‌ చేయగా బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్ అందజేశాడు. 

అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ‘‘మన బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ నుంచి మనందరం దీని కోసమే ప్రయత్నిస్తున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోవద్దు. బ్యాటింగ్‌ విభాగంలోని ప్రతిఒక్కరూ తమవంతు సహకారాన్ని అందిస్తే లక్ష్యాన్ని చేరుకోగలం. అలాంటప్పుడే ఇలాంటి భారీ స్కోర్లు చేయగలం. మనం చాలా రోజులుగా దీని గురించే చర్చించుకుంటున్నాం కదా!. బ్యాటింగ్ కోచ్ (పొలార్డ్), మార్క్‌ బౌచర్‌ (ప్రధాన కోచ్), కెప్టెన్ (హార్దిక్‌ పాండ్య) మన నుంచి ఆశిస్తున్నది ఇదే’’ అని రోహిత్ శర్మ జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా వైరల్‌గా మారింది. ముంబయి తదుపరి మ్యాచ్‌ ఏప్రిల్ 11న బెంగళూరుతో ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని