Shubman Gill: ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కూ డౌటే!

టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అనారోగ్యం కారణంగా మరో మ్యాచ్‌కూ దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కూ అతడు అందుబాటులో ఉండేది అనుమానమే.

Updated : 10 Oct 2023 11:40 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న అతడు.. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. రేపు (బుధవారం) అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కూ అందుబాటులో ఉండటం లేదు. అఫ్గాన్‌తో మ్యాచ్‌ కోసం అతడు దిల్లీ బయలుదేరలేదని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ‘‘ప్లేట్‌లెట్ కౌంట్  70,000కు పడిపోవడంతో ముందు జాగ్రత్తగా గిల్‌ను ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అవసరమైన టెస్టులు నిర్వహించారు. సోమవారం అతడిని డిశ్చార్జ్‌ చేశారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కూ దూరం!

అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న గిల్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టనుంది. మరోవైపు, పాక్‌తో మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయమే ఉంది. దీంతో ఆ మ్యాచ్‌లో గిల్ ఆడేది అనుమానమే. ఆసీస్‌తో మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. శుభ్‌మన్ అందుబాటులోకి వచ్చేవరకు రోహిత్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు.

జోరుమీదున్న టీమ్ఇండియా

ఆసీస్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన టీమ్‌ఇండియా మరో విజయంపై కన్నేసింది. బుధవారం అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగన మ్యాచ్‌లో బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో రోహిత్‌, ఇషాన్‌, శ్రేయస్ అయ్యర్ డకౌట్‌ కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో రాణించాలని కోరుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని