World Cup: ప్రపంచకప్‌ గెలిచిన వేళ.. తండ్రి మరణవార్త: ఛాంపియన్‌ ఓల్గా వ్యథ

తండ్రికి అనారోగ్యం.. మనసు కీడు శంకిస్తున్నా మైదానంలోకి దిగింది.. దేశానికి ప్రపంచకప్‌ అందించింది. సంబరాలు చేసుకొంటున్న సమయంలో వినకూడని వార్త ఆమె చెవినపడింది.

Updated : 21 Aug 2023 10:58 IST

Spains World Cup winner Olga Carmona  ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమె ఏకవ్యక్తి సైన్యంలా పోరాడి దేశానికి మరపురాని విజయాన్నందించింది. కానీ, ఆ సంతోషాన్ని పంచుకునేలోపే తీరని విషాద వార్త వినాల్సి వచ్చింది. ఇది స్పెయిన్‌కు తన ఏకైక గోల్‌తో ఫుట్‌బాల్‌ కప్‌ను అందించిన కెప్టెన్‌ ఓల్గా కర్మోన (Olga Carmona) పరిస్థితి. మ్యాచ్‌ అనంతరం తన కన్న తండ్రి మరణించాడనే విషాదకర వార్త ఆమెను చేరింది. నిన్న ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల ఫిఫా ప్రపంచకప్‌(FIFA World Cup)లో స్పెయిన్‌ ఛాంపియన్‌గా అవతరించింది. కెప్టెన్‌ ఓల్గా గోల్‌తో ఆ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్‌లో స్పెయిన్‌ 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పురుషుల, మహిళల ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన రెండో దేశంగా ఆవిర్భవించింది.

మ్యాచ్‌ అనంతరం ఆమె తండ్రి కన్నుమూశారనే వార్తను కుటుంబ సభ్యుల నుంచి వినాల్సి వచ్చింది. వాస్తవానికి ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ, తన కుమార్తె నేతృత్వంలో స్పెయిన్‌ ఫైనల్స్‌కు చేరుకోవడంతో.. ఆమెకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకు ఓల్గా తల్లి, ఇతర బంధువులు ఆస్ట్రేలియాకు వచ్చారు. ఈ మ్యాచ్‌లో ఓల్గా 29వ నిమిషంలో గోల్‌ చేసిన అనంతరం తన షర్ట్‌ పైకెత్తి ‘మెర్సీ’ అనే సందేశం చూపింది. ఇటీవల తల్లిని కోల్పోయిన తన ప్రాణ స్నేహితురాలి కోసం ఆమె అలా చేసింది. కానీ, మ్యాచ్‌ తర్వాత తన తండ్రి మరణ వార్త వినాల్సి వస్తుందన్న విషయం ఆమెకు ఏమాత్రం తెలియదు. మ్యాచ్‌ అనంతరం సెలబ్రేషన్స్‌ పూర్తయ్యే వరకూ.. ఆమెకు తండ్రి ఇక లేరన్న విషయం చెప్పకూడదని కుటుంబ సభ్యులు కూడా నిర్ణయించారు. మ్యాచ్‌ ఫైనల్‌ విజిల్‌ తర్వాత తన బృందంతో కలిసి ఆమె మైదానంలో సంబరాలు చేసుకొంది.

స్పెయిన్‌దే కిరీటం

మ్యాచ్‌ అనంతరం ఆమెకు విషయం తెలిసింది. దీనిపై ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆమె భావోద్వేగంగా స్పందిస్తూ.. ‘‘నాకు తెలియకుండానే.. మ్యాచ్‌కు ముందు నా మనసు కీడు శంకించింది. అత్యంత ప్రత్యేకమైనది దక్కించుకోవడానికి నువ్వు నాకు బలాన్నిచ్చావు. నువ్వు ఈ రోజు రాత్రి నా ఆటను చూసి గర్వపడి ఉంటావని నాకు తెలుసు. రెస్ట్‌ ఇన్‌ పీస్. డాడ్‌’’ అని పోస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని