Hyderabad VS kolkata : దంచికొట్టిన రాహుల్, మార్‌క్రమ్‌.. హైదరాబాద్‌కు హ్యాట్రిక్‌

టీ20 లీగ్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు...

Updated : 15 Apr 2022 23:25 IST

ముంబయి: టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. కోల్‌కతాపై గెలిచి వరుసగా మూడో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 176 పరుగులు చేసి విజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి (71), మార్‌క్రమ్‌ (68*) అర్ధశతకాలతో హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. కేన్‌ విలియమ్సన్ 17, అభిషేక్ శర్మ 3, నికోలస్ పూరన్ 5* పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2, ప్యాట్ కమిన్స్‌ ఒక వికెట్ తీశారు. 


హైదరాబాద్‌, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్‌క్రమ్‌ (36*), పూరన్‌ (1*) ఉన్నారు. దూకుడుగా ఆడిన రాహుల్‌ త్రిపాఠి (71) ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. ఇంకా హైదరాబాద్‌ 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి.


హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (21 బంతుల్లో 50*: 4 ఫోర్లు, 4 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. కోల్‌కతా బౌలర్‌ వరుణ్ చక్రవర్తి (2-0-30-0)ని టార్గెట్‌ చేస్తూ త్రిపాఠితో పాటు మార్‌క్రమ్ (18*) భారీ షాట్లు కొట్టారు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఇంకా 60 బంతుల్లో హైదరాబాద్‌ విజయానికి 81 పరుగులు కావాలి.


పవర్‌ ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌ జట్టు ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. కోల్‌కతా బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయలేకపోయారు. అయితే కేన్ విలియమ్సన్ (17), రాహుల్ త్రిపాఠి (18*) అడపాదడపా బౌండరీలు బాది ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు చూశారు. ఈ క్రమంలో ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో కేన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్‌ త్రిపాఠితోపాటు మార్‌క్రమ్‌ (1*) ఉన్నాడు. ఇంకా హైదరాబాద్‌ విజయానికి 84 బంతుల్లో 130 పరుగులు కావాలి.


కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనను ఆరంభించిన హైదరాబాద్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ప్యాట్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో అభిషేక్‌ శర్మ (3) క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేన్ విలియమ్సన్ (4*), రాహుల్ త్రిపాఠి (1*) ఉన్నారు.


టీ20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌కు కోల్‌కతా 176 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (54), ఆండ్రూ రస్సెల్ (49*), శ్రేయస్‌ అయ్యర్ (28) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2.. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, సుచిత్ తలో వికెట్ తీశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ కోల్‌కతా బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో హైదరాబాద్‌ బౌలర్లు విజయవంతమయ్యారు. అయితే ఆఖర్లో రస్సెల్‌ దూకుడుగా ఆడటంతో కోల్‌కతా మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించింది.


కోల్‌కతా బ్యాటర్‌ నితీశ్ రాణా (50*) అర్ధశతకం సాధించాడు. హైదారాబాద్‌ బౌలర్ల ధాటికి ఓవైపు వికెట్లు పడుతున్నా నితీశ్ ఎంతో నిలకడగా ఆడాడు. ప్రస్తుతం కోల్‌కతా 15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాణాతోపాటు ఆండ్రూ రస్సెల్ (10*) ఉన్నాడు. అంతకుముందు ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో నటరాజన్‌ క్యాచ్‌ పట్టడంతో జాక్‌సన్‌ (7) పెవిలియన్‌కు చేరాడు.


కాస్త కుదురుకున్నట్లుగా కనిపించిన కోల్‌కతాను హైదరాబాద్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్ దెబ్బకొట్టాడు. అద్భుతమైన బంతికి శ్రేయస్‌ (28)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. హైదరాబాద్‌ బౌలర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్న కోల్‌కతాను నితీశ్‌ రాణా (17*)తో కలిసి శ్రేయస్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి 39 పరుగులు జోడించారు. అయితే ఉమ్రాన్ బౌలింగ్‌లో శ్రేయస్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో కోల్‌కతా నాలుగో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నాలుగు వికెట్లను కోల్పోయి 70 పరుగులు చేసింది.


హైదరాబాద్‌ బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ముగ్గురు కోల్‌కతా బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు. నటరాజన్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను దెబ్బతీశాడు. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా మూడు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (9*), నితీశ్‌ రాణా ఉన్నాడు. వెంకటేశ్ అయ్యర్ (6)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన నటరాజన్‌ బౌలింగ్‌లో తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సునిల్‌ నరైన్‌ (6) తొలి బంతికే సిక్సర్‌ బాదాడు. అయితే రెండో బంతికి శశాంక్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి సునిల్ నరైన్ పెవిలియన్‌కు చేరాడు.


ఆరంభంలోనే కోల్‌కతాకు షాక్‌ తగిలింది. జాన్‌సెన్‌ వేసిన రెండో ఓవర్‌లో ఆరోన్‌ ఫించ్ (7) కీపర్‌ పూరన్‌ చేతికి చిక్కాడు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో కోల్‌కతా బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కోల్‌కతా రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్‌ అయ్యర్ (2*), శ్రేయస్‌ అయ్యర్ (1*) ఉన్నారు.


టీ20 లీగ్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి ఊపు మీదున్న హైదరాబాద్‌ మరికాసేపట్లో టాప్‌-2లో ఉన్న కోల్‌కతాతో తలపడనుంది. టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకుని కోల్‌కతాకు బ్యాటింగ్‌ అప్పగించాడు. హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ ముందుకు వెళ్తుందా..? లేకపోతే మరో గెలుపు నమోదు చేసి కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

జట్ల వివరాలు: 

హైదరాబాద్‌ : కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్‌ పూరన్‌, మార్‌క్రమ్‌, శశాంక్‌ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, ఉమ్రాన్‌ మాలిక్, టి. నటరాజన్

కోల్‌కతా : ఆరోన్‌ ఫించ్, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), నితీశ్‌ రాణా, ఆండ్రూ రస్సెల్, షెల్డన్‌ జాక్‌సన్, ప్యాట్ కమిన్స్, సునిల్ నరైన్, ఉమేశ్‌ యాదవ్, అమన్ హకిమ్, వరుణ్ చక్రవర్తి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని