T20 World Cup: ఇంగ్లాండ్‌పై రబాడ హ్యాట్రిక్‌.. వీడియో చూడండి

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌-1లో ఉన్న దక్షిణాఫ్రికా సూపర్‌-12లో నాలుగు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్‌ చేరలేకపోయింది. నెట్‌రన్‌రేట్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల కన్నా...

Updated : 07 Nov 2021 09:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌-1లో ఉన్న దక్షిణాఫ్రికా సూపర్‌-12లో నాలుగు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్‌ చేరలేకపోయింది. నెట్‌రన్‌రేట్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల కన్నా వెనుకబడటమే అందుకు కారణం. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో గెలుపొందినా అవకాశం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి 189/2 భారీ స్కోర్‌ సాధించగా సెమీస్‌ చేరాలంటే ఇంగ్లాండ్‌ను 131 పరుగులోపే కట్టడి చేయాల్సి వచ్చింది. అయితే, ఇంగ్లిష్‌ టీమ్‌ బాగా పోరాడటంతో అది జరగలేదు. నిర్ణీత ఓవర్లలో ఇంగ్లాండ్‌ 179/8 స్కోర్‌తో సరిపెట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలుపొందింది.

రబాడ హ్యాట్రిక్‌తో విజయం..

అంతకుముందు ఇంగ్లాండ్‌ విజయానికి చివరి ఐదు ఓవర్లలో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో ఛేదన కష్టంగా అనిపించింది. కానీ.. రబాడ వేసిన 16వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ (28; 17 బంతుల్లో 1×4, 3×6) వరుసగా మూడు సిక్స్‌లు బాది 21 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో మలన్‌ (33) ఔటైనా 11 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే ఆఖరి మూడు ఓవర్లలో ఇంగ్లాండ్ 35 పరుగులు చేయాల్సిన స్థితిలో అవకాశాలు మెరుగయ్యాయి. 19 ఓవర్లు ముగిసేసరికి లివింగ్‌స్టోన్‌ను కోల్పోయిన ఆ జట్టు 176/5తో నిలిచి ఇబ్బందుల్లో పడింది. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఇక ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ వేసిన రబాడ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ సాధించి ఇంగ్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.  దక్షిణాఫ్రికా తరఫున టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రబాడ రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్‌ వికెట్ల వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రబాడ బౌలింగ్‌లో ఎవరెలా ఔటయ్యారో మీరూ చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని