IND vs AUS: ఉత్కంఠ పోరు.. తొలి టీ20లో ఆసీస్‌పై భారత్ విజయం

విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 

Updated : 24 Nov 2023 01:59 IST

విశాఖపట్నం: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి అనంతరం ఆసీస్‌ (Aus)తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (Team India) శుభారంభం చేసింది. విశాఖ వేదికగా ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా.. 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్‌ (80; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇషాన్ కిషన్ (58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా అర్ధ శతకంతో మెరిశాడు. చివరి ఓవర్లో భారత్‌ వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ రింకు సింగ్‌(22*) భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా.. రింకు సింగ్ సిక్స్‌ బాదాడు. కానీ, అది నో బాల్ కావడంతో ఒక బంతి మిగిలుండగానే టీమ్ఇండియా విజయం సాధించినట్లయింది. ఈ విజయంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 తిరువనంతపురం వేదికగా ఆదివారం (నవంబర్ 26న) జరగనుంది.

సూర్య, ఇషాన్‌ ధనాధన్ 

భారీ లక్ష్యంతోకి బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌటై వెనుదిరిగాడు. జోరుమీదున్న యశస్వి (21; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ని మూడో ఓవర్లో మాథ్యూ షార్ట్ ఔట్‌ చేయడంతో భారత్ 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ భారత్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 12 ఓవర్లకు భారత్ 124/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. తన్వీర్ సంఘా వేసిన 13వ ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాది హాఫ్‌ సెంచరీ అందుకున్న ఇషాన్.. తర్వాతి బంతికి సిక్స్‌ కొట్టాడు. కానీ, మూడో బంతికి భారీ షాట్ ఆడి మాథ్యూ షార్ట్‌కు చిక్కాడు. సీన్ అబాట్ వేసిన 14వ ఓవర్‌లో రెండో బంతికి సిక్స్ బాది సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ (29 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, ఇషాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. తన్వీర్ సంఘా వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు.. ఐదో బంతికి స్టాయినిస్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్‌తో కలిసి సూర్యకుమార్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. నాథన్ ఎల్లిస్ వేసిన 17వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదేశాడు. బెహెండార్ఫ్‌ వేసిన 18 ఓవర్‌లో లాంగాన్‌లో హర్డీకి చిక్కాడు.

ఆఖరి ఓవర్‌లో హై డ్రామా

చివరి ఓవర్‌లో భారత్ విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా.. రింకు సింగ్, అక్షర్ పటేల్ (2) క్రీజులో ఉండటంతో మ్యాచ్‌ ఆఖరి బంతికి వరకు రాదని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే మొదటి బంతికి రింకు ఫోర్ బాదాడు. తర్వాతి బంతికి లెగ్ బైస్‌ రూపంలో సింగిల్ వచ్చింది. కానీ, భారత్ అనుహ్యంగా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్‌ బౌలర్‌ (సీన్ అబాట్)కే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాతి రెండు బంతులకు రవి బిష్ణోయ్ (0), అర్ష్‌దీప్ (0) రనౌట్ అయ్యారు. చివరి బంతికి ఒక పరుగు అవసరమైన దశలో రింకు సిక్స్ బాదాడు. కానీ, అది నో బాల్ కావడంతో భారత్ ఒక బంతి మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్‌ (110; 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులు) మెరుపు సెంచరీ బాదాడు. స్టీవ్ స్మిత్ (52; 41 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. మాథ్యూ వేడ్ (13), టిమ్ డేవిడ్ (19*), స్టాయినిస్ (7*) రన్స్‌ చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (1/54), ప్రసిద్ధ్‌ కృష్ణ (1/50) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

  • టీ20ల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును అత్యధిక సార్లు (5) ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికా (4 సార్లు) తర్వాతి స్థానంలో ఉంది. టీ20ల్లో భారత్‌కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని